నీ బెదిరింపులకు భయపడే రకాన్ని కాదు.. ఎమ్మెల్సీ అనంతబాబుపై ఎమ్మెల్యే శిరీషాదేవి ఫైర్

  • హత్యా రాజకీయాలకు వైసీపీనే బీజం వేసిందని ఎమ్మెల్యే మండిపాటు
  • అమెరికాలో ఉండి కనుసైగ చేసినా ఎగిరిపోతావన్న ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై ఆగ్రహం
  • ఏజెన్సీలో గంజాయి, మైనింగ్ మాఫియాపై బహిరంగ చర్చకు సవాల్
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తనను హతమారుస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, అటువంటి హెచ్చరికలకు తాను బెదిరే ప్రసక్తే లేదని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి తేల్చిచెప్పారు. టీడీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె ఎమ్మెల్సీ తీరుపై నిప్పులు చెరిగారు.

ప్రశాంతంగా ఉండే ఏజెన్సీ ప్రాంతంలో హత్యా రాజకీయాలను ప్రవేశపెట్టిందే వైసీపీ అని శిరీషాదేవి ఆరోపించారు. తన సొంత కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి, మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన చరిత్ర అనంతబాబుదని ఎద్దేవా చేశారు. ‘అమెరికాలో ఉండి నేను కనుసైగ చేసినా నువ్వు ఎగిరిపోతావు’ అని అనంతబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఒక మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా వ్యంగ్యంగా మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.

ఏజెన్సీలో బినామీల పేరుతో క్వారీలు, రంగురాళ్ల తవ్వకాలు, కలప, గంజాయి స్మగ్లింగ్ చేస్తూ కోట్లు గడించింది ఎవరో ప్రజలందరికీ తెలుసని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తనపై, తన భర్తపై అవినీతి ఆరోపణలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనంతబాబు మైదాన ప్రాంతాల్లో అక్రమంగా కొనుగోలు చేసిన భూముల వివరాలు తన వద్ద ఉన్నాయని, వాటిని త్వరలోనే ఆధారాలతో సహా నిరూపిస్తానని ఆమె స్పష్టం చేశారు.


More Telugu News