కెనడాలో ఆపదలో ఉన్న భారతీయ మహిళల కోసం 24 గంటల హెల్ప్‌లైన్

  • 'వన్ స్టాప్ సెంటర్ ఫర్ వుమెన్' పేరుతో ప్రత్యేక సహాయ కేంద్రం
  • మహిళలకు సకాలంలో తోడుగా నిలిచే లక్ష్యంతో హెల్ప్‌లైన్ ఏర్పాటు
  • కెనడా చట్టాలకు లోబడి వన్ స్టాప్ సెంటర్ ఫర్ వుమెన్ ఏర్పాటు
కెనడాలో ఆపదలో ఉన్న భారతీయ మహిళల కోసం టోరంటోలోని భారత కాన్సులేట్ 'వన్ స్టాప్ సెంటర్ ఫర్ వుమెన్' పేరుతో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది 24 గంటల పాటు అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్‌‌ను కలిగి ఉంటుందని తెలిపింది.

గృహ హింస, దాడి, కుటుంబ వివాదాలు, దోపిడీ, న్యాయపరమైన సవాళ్లు ఎదుర్కొంటున్న భారత పాస్‌పోర్టు కలిగిన మహిళలకు సత్వర సహాయం అందించడమే ఈ కేంద్రం ముఖ్య లక్ష్యం. 'వన్ స్టాప్ సెంటర్ ఫర్ వుమెన్' ద్వారా బాధిత మహిళలకు తక్షణ కౌన్సిలింగ్, మానసిక, సామాజిక మద్దతు అందించడంతో పాటు, సంబంధిత విభాగాల సమన్వయంతో చట్టపరమైన సహాయం, సలహాలు అందిస్తామని కాన్సులేట్ పేర్కొంది.

కెనడా చట్టాలకు లోబడి 'వన్ స్టాప్ సెంటర్ ఫర్ వుమెన్' సహాయం అందిస్తుందని కార్యాలయ వర్గాలు తెలిపాయి. మహిళా అధికారి నేతృత్వంలో ఈ కేంద్ర నిర్వహించబడుతుందని, దీనికి సంబంధించిన వివరాలు కాన్సులేట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.


More Telugu News