'ధురంధర్' స్టార్ అక్షయ్ ఖన్నాకు లీగల్ నోటీసు పంపిన ‘దృశ్యం 3’ నిర్మాత
- 'దృశ్యం 3' నుంచి తప్పుకున్న అక్షయ్ ఖన్నా
- అక్షయ్ కు ముందుగానే కొంత అడ్వాన్స్ చెల్లించామన్న నిర్మాత
- సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ అందుబాటులోకి రాలేదని వెల్లడి
బాలీవుడ్‌లో మరో లీగల్ వివాదం కలకలం రేపింది. 'ధురంధర్' స్టార్ అక్షయ్ ఖన్నా తమ తాజా చిత్రం ‘దృశ్యం 3’ కోసం చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ ఆ సినిమా నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ ఆయనకు లీగల్ నోటీసు పంపారు. ఈ సినిమాలో తాను భాగం కావడం లేదని అక్షయ్ ఖన్నా టెక్ట్స్ మెసేజ్ ద్వారా తెలియజేశారని నిర్మాత తెలిపారు. అయితే, షూటింగ్ కోసం ముందుగానే కొంత మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించామని, అప్పుడు ఒప్పందం కూడా జరిగిందని తెలిపారు.
'దృశ్యం 3' కోసం రెండేళ్లుగా పనిచేస్తున్నామని... ఆ స్క్రిప్ట్ విన్నప్పుడు అక్షయ్ కు కూడా నచ్చిందని... ఆ తర్వాతే ఆయనతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. అయితే, ఈ సినిమా చేయడం లేదని హఠాత్తుగా మెసేజ్ పంపారని తెలిపారు. ఆయనను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ... అందుబాటులోకి రాలేదని చెప్పారు. ఈ క్రమంలోనే అక్షయ్ కు నోటీసులు పంపించామని తెలిపారు. మరోవైపు, అక్షయ్ స్థానంలో జైదీప్ అహ్లావత్ ను తీసుకున్నామని చెప్పారు.