పాకిస్థాన్ చరిత్రలోనే అతిపెద్ద మేధో వలస... దేశాన్ని భారీగా వీడుతున్న వైద్య, ఇంజినీరింగ్, ఫైనాన్స్ నిపుణులు!

  • నానాటికీ కుదేలవుతున్న పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ
  • భవిష్యత్తుపై నమ్మకం కోల్పోతున్న విద్యావంతులు
  • 2,144 శాతం పెరిగిన నర్సుల వలస
  • ఇది 'బ్రెయిన్ డ్రెయిన్' కాదన్న ఆర్మీ చీఫ్ పై ప్రజల ఆగ్రహం
  • రాజకీయ వ్యవస్థను సరిచేయాలన్న మాజీ సెనేటర్ ముస్తఫా

దాయాది దేశం పాకిస్థాన్ తన చరిత్రలోనే అతిపెద్ద మేధో వలసను ఎదుర్కొంటోంది. దేశంలో కుదేలవుతున్న ఆర్థిక పరిస్థితులు, రాజకీయ అస్థిరత, భవిష్యత్తుపై నమ్మకం కోల్పోవడం వల్ల చదువుకున్న యువత భారీ సంఖ్యలో దేశాన్ని విడిచిపెడుతోంది. గత రెండేళ్లలోనే వేల సంఖ్యలో డాక్టర్లు, ఇంజినీర్లు, అకౌంటెంట్లు పాకిస్థాన్‌ను వదిలి విదేశాలకు వెళ్లిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ప్రభుత్వ నివేదిక ఈ పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో స్పష్టంగా చూపిస్తోంది.


ఆ నివేదిక ప్రకారం గత 24 నెలల్లో పాకిస్థాన్ నుంచి సుమారు 5వేల మంది డాక్టర్లు, 11 వేల మంది ఇంజినీర్లు, 13 వేల మంది అకౌంటెంట్లు ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఇది కేవలం గణాంకాల పరమైన నష్టం మాత్రమే కాదు... దేశ భవిష్యత్తును నడిపించాల్సిన మేధస్సు బయటకు వెళ్లిపోతున్న దారుణ స్థితికి ప్రతీక. ఈ వలసతో ముఖ్యంగా ఆరోగ్య, ఇంజినీరింగ్, ఫైనాన్స్ వంటి కీలక రంగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.


ఈ పరిస్థితిపై పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఇటీవల ఆయన ఈ భారీ వలసను “బ్రెయిన్ డ్రెయిన్ కాదు, బ్రెయిన్ గైన్” అంటూ సమర్థించేందుకు ప్రయత్నించారు. కానీ వాస్తవ గణాంకాలు మాత్రం ఆయన వ్యాఖ్యలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. చదువుకున్న యువత దేశంలో అవకాశాలు లేక బయటకు వెళ్లిపోతుంటే, దాన్ని ‘లాభం’గా చెప్పడం ప్రజలను మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది.


ఈ అంశాన్ని మాజీ సెనేటర్ ముస్తఫా నవాజ్ ఖోఖర్ బహిరంగంగా ప్రస్తావించారు. రాజకీయ వ్యవస్థను సరిచేయకపోతే ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోదని ఆయన హెచ్చరించారు. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఫ్రీలాన్సింగ్ హబ్‌గా గుర్తింపు పొందిన పాకిస్థాన్... తరచూ జరిగే ఇంటర్నెట్ షట్‌డౌన్‌ల వల్ల ఏకంగా 1.62 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిందని తెలిపారు. దీని కారణంగా దాదాపు 23.7 లక్షల ఫ్రీలాన్సింగ్ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని ఆయన పేర్కొన్నారు.


పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అండ్ ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ విడుదల చేసిన తాజా డేటా ఈ పరిస్థితిని మరింత ఆందోళనకరంగా చూపిస్తోంది. 2024లో 7,27,381 మంది విదేశీ ఉద్యోగాల కోసం నమోదు చేసుకోగా... ఈ ఏడాది నవంబర్ నాటికే 6,87,246 మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒకప్పుడు గల్ఫ్ దేశాలకు కూలీ పనుల కోసం వెళ్లే వారు ఎక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. డిగ్రీలు, వృత్తి నైపుణ్యాలు ఉన్న వైట్ కాలర్ ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో దేశాన్ని వదిలి వెళ్లిపోతున్నారు.


ఇందులో అత్యంత ఆందోళన కలిగించే అంశం ఆరోగ్య రంగం. డాక్టర్లతో పాటు నర్సుల వలస కూడా ప్రమాదకర స్థాయికి చేరింది. 2011 నుంచి 2024 మధ్య కాలంలో నర్సుల వలస ఏకంగా 2,144 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది కూడా అదే ధోరణి కొనసాగుతోంది. దీని ప్రభావం పాకిస్థాన్ ఆరోగ్య వ్యవస్థపై తీవ్రంగా పడనుంది.


చదువుకున్న వర్గం దేశం విడిచిపెడుతుండటంతో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. విమానాశ్రయాల్లో నియంత్రణలను కఠినతరం చేసింది. 2025లో ఇప్పటివరకు 66,154 మంది ప్రయాణికులను వివిధ కారణాలతో విమానాశ్రయాల్లోనే నిలిపివేసినట్లు తెలుస్తోంది. 


మొత్తానికి పాకిస్థాన్ ఎదుర్కొంటున్న ఈ మేధో వలస కేవలం తాత్కాలిక సమస్య కాదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య సేవలు, సాంకేతిక పురోగతిపై దీర్ఘకాల ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. పరిస్థితిని సరిచేయాలంటే రాజకీయ స్థిరత్వం, ఆర్థిక సంస్కరణలు, యువతకు అవకాశాలు కల్పించడం అత్యవసరం. లేదంటే దేశం తన అత్యంత విలువైన సంపద అయిన మానవ వనరులను పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.



More Telugu News