బంగ్లాదేశ్‌లో ప్రముఖ సింగర్ జేమ్స్ కచేరీపై దాడి.. వీడియో ఇదిగో!

  • వేదికను ముట్టడించి రాళ్లు, ఇటుకలతో దాడికి దిగిన అతివాద మూకలు
  • రక్షణ లేకపోవడంతో ఇప్పటికే బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేసుకున్న భారతీయ కళాకారులు 
  • తాజా ఘటనపై రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆవేదన
బంగ్లాదేశ్‌లో సాంస్కృతిక స్వేచ్ఛపై దాడులు పెరుగుతున్నాయి. కళాకారులు, ప్రదర్శకులు, సాంస్కృతిక సంస్థలే లక్ష్యంగా అతివాద మూకలు రెచ్చిపోతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ రాక్ స్టార్..'గ్యాంగ్‌స్టర్' (భీగీ భీగీ), 'లైఫ్ ఇన్ ఏ మెట్రో' సినిమాలతో భారత ప్రేక్షకులకు  సుపరిచితుడైన సింగర్ జేమ్స్ సంగీత విభావరిపై దాడి జరిగింది. ఢాకాకు 120 కిలోమీటర్ల దూరంలోని ఫరీద్‌పూర్‌లో శుక్రవారం రాత్రి జరగాల్సిన ఈ కచేరీని ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అధికారులు రద్దు చేశారు.

ఒక స్థానిక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా జేమ్స్ కచేరీని ఏర్పాటు చేశారు. అయితే కార్యక్రమం మొదలయ్యే సమయంలో కొంతమంది దుండగులు వేదిక వద్దకు దూసుకొచ్చి రాళ్లు, ఇటుకలతో దాడికి దిగారు. అక్కడున్న విద్యార్థులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, పరిస్థితి అదుపు తప్పడంతో భద్రతా కారణాల దృష్ట్యా స్థానిక అధికారులు కచేరీని నిలిపివేశారు.

తస్లీమా నస్రీన్ ఆవేదన
బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురైన రచయిత్రి తస్లీమా నస్రీన్ ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. "బంగ్లాదేశ్‌లో లౌకికవాదాన్ని పెంచిపోషించే ఛాయానౌట్, ఉదీచి వంటి సాంస్కృతిక సంస్థలను దహనం చేశారు. ఇప్పుడు జిహాదీలు ప్రముఖ గాయకుడు జేమ్స్‌ను కూడా పాడనివ్వడం లేదు" అని ఆమె మండిపడ్డారు. ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ మనవడు సిరాజ్ అలీ ఖాన్, ఉస్తాద్ రషీద్ ఖాన్ కుమారుడు అర్మాన్ ఖాన్ వంటి కళాకారులు కూడా బంగ్లాదేశ్‌లో భద్రత లేదనే కారణంతో అక్కడి ఆహ్వానాలను తిరస్కరించడం గమనార్హం.

అస్థిరత కోసమేనా?
మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ దాడులను అరికట్టడంలో విఫలమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయించేందుకు, కావాలని శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.


More Telugu News