ఈ నెల 29న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న కేసీఆర్!

  • అసెంబ్లీ సమావేశాల అనంతరం బీఆర్ఎస్ బహిరంగ సభలు
  • ముఖ్య నాయకులతో కేసీఆర్ సమావేశం
  • పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల తదుపరి కార్యాచరణపై మంతనాలు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 29న శాసనసభకు హాజరయ్యే అవకాశముందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం బీఆర్ఎస్ బహిరంగ సభలు ఉంటాయని వారు తెలిపారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్టీ సీనియర్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. వారితో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తదుపరి కార్యాచరణపై నేతలతో చర్చించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారని సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగానే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయమే చేస్తోందని ముఖ్య పార్టీ నేతల సమావేశంలో కేసీఆర్ అన్నారని తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంపై బీఆర్ఎస్ పార్టీకి తప్ప మరే పార్టీకి పట్టింపు లేదని, మనకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టాలని ఆయన నేతలకు సూచించారు. ప్రజల్లోకి వెళ్లి, ఉద్యమాన్ని నిర్మిద్దామని నాయకులతో అన్నారు. నీటి హక్కులు పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్ పైన ఉందని, అసెంబ్లీ వేదికగా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వివరిద్దామని కేసీఆర్ అన్నారని తెలుస్తోంది.


More Telugu News