21 ఏళ్లకే మున్సిపల్ చైర్‌పర్సన్‌.. ఎవరీ దియా బినూ...?

  • దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్‌పర్సన్‌గా దియా రికార్డు
  • కేరళలోని పాలాయ్ మున్సిపాలిటీకి చైర్‌పర్సన్‌గా ఎన్నికైన 21 ఏళ్ల యువతి
  • తండ్రి, బాబాయ్‌లతో కలిసి కౌన్సిల్‌లో అడుగుపెట్టిన దియా
  • తండ్రిని తొలగించిన రెండేళ్లకే కూతురు అదే పదవికి ఎన్నిక
  • కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మద్దతుతో చైర్‌పర్సన్‌గా నియామకం
కేరళ స్థానిక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్‌పర్సన్‌గా 21 ఏళ్ల దియా బినూ పులిక్కకండం రికార్డు సృష్టించింది. కొట్టాయం జిల్లాలోని పాలాయ్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించింది. ఈ పరిణామం భారత స్థానిక పాలనా చరిత్రలో ఒక అరుదైన ఘట్టంగా నిలిచింది.

ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, తీవ్రమైన రాజకీయ చర్చల అనంతరం దియా ఎన్నిక ఖరారైంది. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో దియా, ఆమె తండ్రి, మాజీ చైర్మన్ అయిన బిను పులిక్కకండం, ఆమె బాబాయ్ బిజు పులిక్కకండం ముగ్గురూ ఇండిపెండెంట్లుగా గెలుపొందారు. ఈ గెలుపు వారి రాజకీయ భవిష్యత్తును నిర్దేశించింది.

ఈ విజయం వెనుక బలమైన రాజకీయ నేపథ్యం కూడా ఉంది. సరిగ్గా రెండేళ్ల క్రితం కేరళ కాంగ్రెస్ (ఎం) నేత జోస్ కె. మణి.. దియా తండ్రి బినూను చైర్మన్ పదవి నుంచి తొలగించారు. ఇప్పుడు అదే పదవి ఆయన కుమార్తెకు దక్కడం పులిక్కకండం కుటుంబానికి రాజకీయంగా లభించిన విజయంగా అక్కడి వర్గాలు భావిస్తున్నాయి.

మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ చదివిన దియా, తండ్రి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చింది. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)కు మద్దతివ్వాలంటే దియాను చైర్‌పర్సన్‌గా చేయాలనే షరతును ఆమె కుటుంబం విధించింది. అందుకు యూడీఎఫ్ అంగీకరించడంతో ఆమె ఎన్నిక సాధ్యమైంది. ప్రస్తుతం దియా తన తండ్రి, బాబాయ్‌లు కౌన్సిలర్లుగా ఉన్న సభకు అధ్యక్షత వహించనుండడం విశేషం. చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నత చదువులు కొనసాగిస్తానని ఆమె తెలిపింది.


More Telugu News