ఆ సినిమా కంటే మన మహాభారతం, రామాయణం గొప్పవని పిల్లలకు చెప్పాలి: సీఎం చంద్రబాబు

  • భారత్ త్వరలోనే సూపర్ పవర్ అవుతుందన్న చంద్రబాబు
  • స్పైడర్ మ్యాన్ కన్నా హనుమంతుడే బలవంతుడని పిల్లలకు చెప్పాలని సూచన
  • దేశ సంస్కృతి పరిరక్షణకు మోహన్ భగవత్ కృషి అభినందనీయమని కితాబు
  • 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని ధీమా
  • ఏపీలో క్వాంటం కంప్యూటర్, గ్రీన్ ఎనర్జీ రంగాలకు ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడి
స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ వంటి కాల్పనిక పాత్రల కన్నా హనుమంతుడు, అర్జునుడు వంటి మన పురాణ పురుషులే గొప్పవారని పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అవతార్ సినిమా కంటే మన మహాభారతం, రామాయణం చాలా గొప్పవని పిల్లలకు చెప్పాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని, సూపర్ పవర్‌గా అవతరించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో శుక్రవారం జరిగిన 'భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్' ప్రారంభ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "వేల ఏళ్ల క్రితమే హరప్పా నాగరికత ద్వారా అర్బన్ ప్లానింగ్‌ను ప్రపంచానికి పరిచయం చేశామని, యోగా, ఆయుర్వేదం వంటి శాస్త్రాలను అందించామని గుర్తుచేశారు. తక్షశిల, నలంద వంటి విశ్వవిద్యాలయాలతో పాటు, సున్నాను, చదరంగాన్ని కనిపెట్టిన ఘనత మనదే. ఆర్యభట్ట, భాస్కరాచార్య, కౌటిల్యుడు వంటి మహానుభావులు మనకు స్ఫూర్తి" అని అన్నారు. రెండు వేల ఏళ్ల క్రితమే ప్రపంచ జీడీపీలో 40 శాతం వాటాతో భారత్ నాలెడ్జ్ ఎకానమీలో సూపర్ పవర్‌గా ఉండేదని, విదేశీ పాలన, కొన్ని విధానాల వల్ల వెనుకబడ్డామని తెలిపారు.

దేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ, దేశాభివృద్ధికి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేస్తున్న కృషి శ్లాఘనీయమని కొనియాడారు. "తిరుగులేని యువశక్తి మన దేశం సొంతం. ఇదే మనల్ని అగ్రస్థానంలో నిలుపుతుంది. దేశాభివృద్ధికి వాజ్‌పేయి పునాదులు వేస్తే, ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతంగా ముందుకు తీసుకెళుతున్నారు" అని చంద్రబాబు పేర్కొన్నారు. మన కుటుంబ వ్యవస్థ గొప్పదని, పిల్లలకు మన పురాణాల గురించి వివరించాలని సూచించారు.

రాష్ట్ర అభివృద్ధికి చేపడుతున్న ప్రణాళికలను కూడా చంద్రబాబు వివరించారు. ఏపీలో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, త్వరలోనే రాష్ట్రం నుంచి క్వాంటం కంప్యూటర్ ఆపరేట్ చేయబోతున్నామని తెలిపారు. విశాఖలో గూగుల్ వంటి సంస్థలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నాయని వెల్లడించారు.

సదస్సు ప్రారంభానికి ముందు చంద్రబాబు, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో కలిసి ప్రాంగణంలోని స్టాళ్లను సందర్శించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పలు పరికరాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, మంత్రి అనగాని సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'ఇండియాస్ నాలెడ్జ్ సిస్టమ్స్' అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.




More Telugu News