మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌కు నిద్రలేమికి సంబంధం.. అధ్యయనంలో షాకింగ్ నిజాలు!

  • నైట్ షిఫ్టులు చేసే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు 
  • శరీర జీవ గడియారం దెబ్బతినడమే దీనికి ప్రధాన కారణమని వెల్లడి
  • రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి క్యాన్సర్ కణాల పెరుగుదలకు ఆస్కారం
  • టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో కీలక అంశాలు
తరచూ నైట్ షిఫ్టులలో పనిచేయడం లేదా వేర్వేరు టైమ్ జోన్‌లకు విమాన ప్రయాణాలు చేయడం వంటి కారణాలతో నిద్ర సమయాలు అస్తవ్యస్తంగా మారే మహిళలు వేగంగా రొమ్ము క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. శరీరంలోని 'జీవ గడియారం' (Circadian Rhythm) దెబ్బతినడం వల్ల రొమ్ము గ్రంథుల నిర్మాణంలో మార్పులు రావడంతో పాటు రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు.

ఈ పరిశోధనలో భాగంగా... బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేలా జన్యుపరంగా మార్పులు చేసిన ఎలుకలను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపును సాధారణ పగలు-రాత్రి వాతావరణంలో, మరో గ్రూపును అస్తవ్యస్తమైన లైటింగ్ పరిస్థితుల్లో ఉంచి వాటి జీవ గడియారానికి అంతరాయం కలిగించారు. సాధారణ పరిస్థితుల్లో ఉన్న ఎలుకలకు 22 వారాల సమయంలో క్యాన్సర్ రాగా, నిద్రకు ఆటంకం కలిగిన గ్రూపులో కేవలం 18 వారాలకే క్యాన్సర్ లక్షణాలు కనిపించాయి.

"మన అంతర్గత గడియారం దెబ్బతింటే, క్యాన్సర్ దానిని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది" అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ తపశ్రీ రాయ్ సర్కార్ తెలిపారు. నిద్ర సమయాలు మారిన ఎలుకలలో క్యాన్సర్ కణితులు వేగంగా పెరగడమే కాకుండా, ఊపిరితిత్తులకు కూడా వ్యాపించాయని గుర్తించారు. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ రోగులలో ప్రమాదానికి సంకేతంగా భావిస్తారు.

శరీర జీవ గడియారం దెబ్బతినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పనితీరు మందగించి, క్యాన్సర్ కణాలు సులభంగా పెరిగేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని సర్కార్ వివరించారు. అంతేకాకుండా ఆరోగ్యవంతమైన రొమ్ము కణజాలంలో కూడా మార్పులు వచ్చి, భవిష్యత్తులో క్యాన్సర్‌కు మరింత ఎక్కువ ఆస్కారం కలుగుతోందని ఈ అధ్యయనం తేల్చింది. ఈ పరిశోధన వివరాలు 'ఆంకోజీన్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.


More Telugu News