ఒక్క ప్రెస్ మీట్‌కే రేవంత్‌కు చెమటలు... మా అయ్య మొనగాడు: కేటీఆర్

  • కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్‌కే రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టాయ‌న్న కేటీఆర్
  • కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగిపోతుందని ఎద్దేవా
  • సంచులు మోసి పేమెంట్ కోటాలో రేవంత్ సీఎం అయ్యారంటూ విమ‌ర్శ‌
  • మహిళలకు రూ.2500, తులం బంగారం హామీలు ఏమయ్యాయి? అంటూ నిల‌దీత‌
  • కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతామ‌న్న‌ కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ నిర్వహించిన ఒక్క ప్రెస్ మీట్‌తోనే రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని, అలాంటిది ఆయన అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగి చనిపోతాడ‌ని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత దోసల అనిల్, కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

"మా అయ్య మొగోడు, తెలంగాణ తెచ్చిన మొనగాడు. ఆయన పేరు నేను బరాబర్ చెప్పుకుంటా" అని కేటీఆర్ అన్నారు. తాను గుంటూరులో ఇంటర్ చదివితే రేవంత్ రెడ్డికి వచ్చిన నొప్పేంటని ప్రశ్నించారు. "రేవంత్ అల్లుడు కూడా ఆంధ్ర వ్యక్తే కదా? ఆయన చిట్టినాయుడు కాదు, భీమవరం బుల్లోడు" అంటూ వ్యక్తిగత విమర్శలు చేశారు. సంచులు మోసి, జైలుకు వెళ్లి, పేమెంట్ కోటాలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని కేటీఆర్ ఆరోపించారు.

ఎన్నికల హామీలను విస్మరించారని విమర్శిస్తూ, రేవంత్ రెడ్డిని "ఎనుముల రేవంత్ కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి" అని అభివర్ణించారు. కల్యాణలక్ష్మికి తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని సోనియా, ప్రియాంక గాంధీలపై ఒట్టువేసి ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు. హామీల గురించి ప్రశ్నిస్తే "గుడ్లు పీకి గోటీలు ఆడుతా", "లాగుల తొండలు ఇడుస్తా" అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష దారుణంగా ఉందని అన్నారు. తాను తిట్టాలనుకుంటే మూడు భాషల్లో పొల్లు పొల్లు తిట్టగలనని హెచ్చరించారు.

రాబోయే ఎన్నికల్లో కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని ఓడించే బాధ్యత తమదేనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని కేసీఆర్ అడగడంలో తప్పేముందని ప్రశ్నించారు.


More Telugu News