ఎంసీజీలో సరికొత్త చరిత్ర.. బాక్సింగ్ డే టెస్టుకు పోటెత్తిన అభిమానులు.. బద్దలైన పాత రికార్డులు

  • బాక్సింగ్ డే టెస్టుకు రికార్డు స్థాయిలో హాజరైన ప్రేక్షకులు
  • ఒకే రోజు 94,199 మంది హాజరుతో ఎంసీజీలో సరికొత్త రికార్డు
  • 2015 ప్రపంచకప్ ఫైనల్ రికార్డును అధిగమించిన హాజరు
ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) ఓ అరుదైన రికార్డుకు వేదికైంది. యాషెస్ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు ఆటను వీక్షించేందుకు రికార్డు స్థాయిలో 94,199 మంది అభిమానులు తరలివచ్చారు. దీంతో ఈ మైదానంలో ఒక క్రికెట్ మ్యాచ్‌కు అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన రికార్డు నమోదైంది.

గతంలో 2015 ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌కు 93,013 మంది హాజరయ్యారు. ఇప్పటివరకు అదే అత్యధికం కాగా, తాజా మ్యాచ్ ఆ రికార్డును బద్దలు కొట్టింది. అంతేకాకుండా ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఒకే రోజు అత్యధిక ప్రేక్షకులు హాజరైన రికార్డు కూడా నమోదైంది. 2013లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన బాక్సింగ్ డే టెస్టు తొలి రోజుకు 91,112 మంది హాజరు కాగా, ఆ రికార్డు ఇప్పుడు కనుమరుగైంది.

ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే 3-0 ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టులో తొలి రోజుతో పాటు రెండు, మూడు రోజుల టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడయ్యాయి. దీంతో 2013లో నమోదైన యాషెస్ సిరీస్ మొత్తం హాజరు రికార్డు (2,71,865) కూడా ఈసారి బద్దలయ్యే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మరో కీలక ప్రకటన చేసింది. మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్‌కు 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2027 మార్చిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య చారిత్రక డే-నైట్ టెస్టును ఎంసీజీలో నిర్వహించనుంది. ఎంసీజీలో ఆస్ట్రేలియా పురుషుల జట్టు ఆడనున్న తొలి పింక్ బాల్ టెస్ట్ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్‌కు భారీ స్పందన వస్తుందని అంచనా వేస్తున్న సీఏ, తమ చరిత్రలోనే తొలిసారిగా టికెట్ బ్యాలెట్‌ను ప్రారంభించింది.


More Telugu News