ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన

  • దీర్ఘకాలిక పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలన్న సీజేఐ
  • పర్యావరణ సంస్థలు, నిపుణులు సమర్థవంతంగా పరిష్కారం కనుగొంటారని ఆశాభావం
  • ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని ఆందోళన
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీ వాయు కాలుష్యంపై వివిధ సంస్థలు, రాజకీయ నాయకులతో పాటు సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో స్పందించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే సంబంధిత సంస్థలు దీనికి పరిష్కారం కనుగొంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

దేశ రాజధానిని పీడిస్తున్న ఈ సమస్యను నివారించడానికి స్వల్పకాలిక ప్రయోజనాలు కలిగించే విధానాల కంటే దీర్ఘకాలిక పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. గోవాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన జస్టిస్ సూర్యకాంత్ మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ వాయు కాలుష్యంపై పర్యావరణ సంస్థలు, నిపుణులు సమర్థవంతంగా పరిష్కారం కనుగొంటారని అభిప్రాయపడ్డారు.

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం హానికర పొగమంచు ఢిల్లీలోని అనేక ప్రాంతాలను కమ్మేసింది. దీంతో దృశ్య నాణ్యత కూడా బాగా పడిపోయింది. వాయు కాలుష్యం తీవ్రంగా ఉండటంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్-4 కింద ఆంక్షల అమలును కొనసాగిస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) గురువారం ఉదయం 220గా నమోదైంది. ఓ సమయంలో 310గా కూడా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది.


More Telugu News