సీక్రెట్‌గా మొబైల్ వాడుతోందని భార్యను చంపి.. ఇంటి పెరట్లోనే పాతిపెట్టిన భర్త

  • భార్య రహస్యంగా ఫోన్ వాడుతోందని గొంతు నులిమి చంపిన భర్త
  • మృతదేహాన్ని ఇంటి వెనుకే గొయ్యి తీసి పూడ్చిపెట్టిన వైనం
  • ఆత్మహత్య చేసుకుందని పోలీసులను నమ్మించే ప్రయత్నం
  • విచారణలో నిజం ఒప్పుకోవడంతో వెలుగులోకి వచ్చిన దారుణం
  • వివాహేతర సంబంధంపై అనుమానమే హత్యకు కారణమని వెల్లడి
భార్య రహస్యంగా మొబైల్ ఫోన్ వాడుతోందన్న కోపంతో ఓ భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇంటి వెనుకే గొయ్యి తీసి పూడ్చిపెట్టి, ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. లూథియానాలో కూలీగా పనిచేసే అర్జున్, ఈ నెల‌ 21న గోరఖ్‌పూర్‌లోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో అతని భార్య ఖుష్బూ రహస్యంగా మొబైల్ ఫోన్ వాడటాన్ని గమనించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన అర్జున్, ఖుష్బూ గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటి వెనుక ఆరడుగుల గొయ్యి తవ్వి, ఓ మడత మంచం సహా ఆమె మృతదేహాన్ని అందులో పూడ్చిపెట్టాడు.

అనంతరం ఖుష్బూ ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులను నమ్మించాడు. రోజులు గడుస్తున్నా ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఖుష్బూ తండ్రి తన అల్లుడిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు అర్జున్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని, మృతదేహాన్ని నదిలో పడేశానని చెప్పాడు. పోలీసులను గ్రామ సమీపంలోని నదీ తీరానికి తీసుకెళ్లి గంటలపాటు తప్పుదోవ పట్టించాడు.

నదిలో గాలింపు విఫలమవడంతో పోలీసులు తమదైన శైలిలో అర్జున్‌ను మరోసారి విచారించగా, అతను నేరాన్ని అంగీకరించాడు. "నిందితుడు ఇచ్చిన సమాచారంతో ఇంటి వెనుక తవ్వకాలు జరపగా మృతదేహం లభ్యమైంది" అని గోరఖ్‌పూర్ సర్కిల్ ఆఫీసర్ శిల్పా కుమారి తెలిపారు. వివాహేతర సంబంధంపై అనుమానంతోనే అర్జున్ ఈ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న ఈ దంపతులకు పిల్లలు లేరు.


More Telugu News