అత్యాచార ఆరోపణలు.. స్టార్ బౌలర్‌కు పోక్సో కోర్టులో చుక్కెదురు

  • స్టార్ పేసర్ యశ్ దయాల్‌కు జైపూర్ పోక్సో కోర్టులో చుక్కెదురు
  • ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన న్యాయస్థానం
  • తీవ్రమైన ఆరోపణలు కావడంతో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ పేసర్ యశ్ దయాల్‌కు జైపూర్ పోక్సో కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అతడి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. రాజస్థాన్‌కు చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ అతడిపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు జైపూర్ పోక్సో కోర్టు నిరాకరించింది.

క్రికెట్‌లో కెరీర్ చూపిస్తానని నమ్మించి రెండేళ్లుగా యశ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని కొన్ని నెలల క్రితం ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. జైపూర్‌లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మొదటిసారి యశ్‌ను కలిసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. క్రికెట్ కెరీర్‌లో సలహాలు ఇస్తానంటూ హోటల్‌కు పిలిచి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించింది.

ఆ సమయంలో బాధితురాలి వయస్సు 17 సంవత్సరాలు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నేరం రుజువైతే కనీసం పదేళ్లు లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. గతంలో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువతి కూడా యశ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అనంతరం దీనిపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా అరెస్టుపై అతనికి స్టే లభించింది.


More Telugu News