ఢిల్లీలో మెగా హంగామా.. ‘పెద్ది’ షూటింగ్‌ లో రామ్ చరణ్!

  • ఢిల్లీలో శరవేగంగా కొనసాగుతున్న ‘పెద్ది’ షూటింగ్
  • అరుణ్ జైట్లీ స్టేడియం, పార్లమెంట్ పరిసరాల్లో కీలక సన్నివేశాల చిత్రీక‌ర‌ణ‌
  • ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం, లైబ్రరీలో షూటింగ్ ప్లాన్ చేసిన చిత్ర‌బృందం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన తాజా చిత్రం ‘పెద్ది’ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ బ‌డా నిర్మాణ సంస్థ‌ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా మూవీపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా టీజర్‌లోని క్రికెట్ షాట్, ‘చికిరి చికిరి’ పాటలోని స్టెప్పులు జ‌నాల‌ను బాగా ఆకట్టుకున్నాయి.

బాలీవుడ్ న‌టి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌తో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వ‌చ్చే ఏడాది మార్చి 27న చెర్రీ బ‌ర్త్‌డే కానుక‌గా సినిమా విడుదలకు సిద్ధమవుతుండటంతో, చిత్ర యూనిట్ షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. ప్రస్తుతం ‘పెద్ది’ షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది.

ఈ షెడ్యూల్ కోసం చిత్రబృందం రాజధానిలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం, ఏపీ భవన్, పార్లమెంట్ పరిసరాలు, ఇండియా గేట్ వంటి ప్రముఖ ప్రదేశాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అంతేగాక‌ ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీతో పాటు ప్రధాని కార్యాలయ పరిధిలోనూ షూటింగ్ జరుగనుందన్న సమాచారం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం, లైబ్రరీని సందర్శించి అధికారులతో భేటీ అయిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత ఉత్తరాదిలో చరణ్‌కు ఏర్పడిన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పుడు ఢిల్లీలో స్పష్టంగా కనిపిస్తోంది. షూటింగ్ ప్రాంతాలకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండగా, అక్కడి పోలీస్ సిబ్బంది కూడా చరణ్‌తో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించడం విశేషం.

ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక లొకేషన్లలో షూటింగ్ జరగడం చూస్తే, దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాను ఎంతో ప్రత్యేకంగా రూపొందిస్తున్నారని అభిమానులు భావిస్తున్నారు. మొత్తంగా ‘పెద్ది’ రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందన్న అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.


More Telugu News