'బాహుబలి'తో మరో రికార్డు దిశగా ఇస్రో

  • బాహుబలి ఎల్వీఎం-3తో 6,400 కిలోల అమెరికా ‘బ్లూబర్డ్‌’ ఉపగ్రహ ప్రయోగం
  • భారత గడ్డపై నుంచి ఇంత భారీ ఉపగ్రహం ఇదే తొలిసారి
  • అమెరికా ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌తో వాణిజ్య ఒప్పందం
  • 4,400 కిలోల పాత రికార్డు బ్రేక్‌కు సిద్ధం
  • ఇది ఇస్రో వాణిజ్య ప్రయోగాల్లో మరో చారిత్రక మైలురాయి
వాణిజ్య అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక మైలురాయికి చేరువైంది. తన శక్తివంతమైన ఎల్వీఎం-3 (బాహుబలి) రాకెట్‌ ద్వారా అమెరికాకు చెందిన కొత్తతరం కమ్యూనికేషన్‌ ఉపగ్రహం ‘బ్లూబర్డ్‌ బ్లాక్‌-2’ను కక్ష్యలోకి చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ వేదికగా ఈరోజు ఉదయం 8.54 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. దీనికి సంబంధించిన 24 గంటల కౌంట్‌డౌన్‌ ఇప్పటికే ప్రారంభమై నిరంతరాయంగా కొనసాగుతోంది.

ఈ ప్రయోగంలో 6,400 కిలోల బరువున్న బ్లూబర్డ్‌ ఉపగ్రహాన్ని ఎల్వీఎం-3-ఎం6 రాకెట్‌ మోసుకెళ్లనుంది. ప్రయోగం జరిగిన 15.07 నిమిషాల్లో రాకెట్‌ మూడు దశలు పూర్తిచేసి, ఉపగ్రహాన్ని లో ఎర్త్‌ ఆర్బిట్‌ (లియో)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టనుంది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌ సంస్థతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ ప్రయోగం చేపడుతున్నారు. భారత భూభాగం నుంచి ఇంతటి భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇప్పటివరకు ఇస్రో సాధించిన 4,400 కిలోల పేలోడ్‌ ప్రయోగ రికార్డు ఈ ప్రయోగంతో బ్రేక్ కానుంది. బాహుబలిగా పేరుగాంచిన ఎల్వీఎం-3 రాకెట్‌ 43.5 మీటర్ల ఎత్తు, 640 టన్నుల బరువుతో అత్యంత విశ్వసనీయ రాకెట్‌గా గుర్తింపు పొందింది. ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-3 సహా ఇప్పటివరకు చేపట్టిన ఎనిమిది ప్రయోగాలు విజయవంతమయ్యాయి. కాగా, ఎల్వీఎం-3 ద్వారా చేపడుతున్న మూడో వాణిజ్య ప్రయోగమిది. గతంలో వన్‌వెబ్‌ సంస్థకు చెందిన రెండు వాణిజ్య ఉపగ్రహాలను ఈ రాకెట్‌ కక్ష్యలోకి చేర్చింది. 

ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మిషన్‌ భారత అంతరిక్ష రంగానికి గర్వకారణంగా నిలవనుంది. భారీ అమెరికన్‌ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని భారత రాకెట్‌ మోసుకెళ్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష రంగం చూపంతా ఇప్పుడు ఇస్రోపైనే కేంద్రీకృతమైంది.


More Telugu News