పాకిస్థాన్ ఎయిర్ లైన్స్‌కు ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ ఝలక్

  • పీఐఏ ప్రైవేటీకరణకు బిడ్‌లు ఆఫర్ చేసిన పాకిస్థాన్ సర్కార్
  • ఐఎంఎఫ్ షరతుల నేపథ్యంలో సంస్కరణల అమలుకు సిద్దమైన పాక్ సర్కార్
  • చివరి నిమిషంలో బిడ్డింగ్ నుంచి వైదొలిగిన ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ
ప్రైవేటీకరణకు సిద్ధమవుతున్న పాకిస్థాన్ ప్రభుత్వ విమానయాన సంస్థ పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కు ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ గట్టి ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. పీఐఏలో 75 శాతం వాటా కొనుగోలుకు బిడ్డింగ్ వేసిన ఈ సంస్థ చివరి నిమిషంలో తన ప్రతిపాదనను ఉపసంహరించుకుంది.

పీఐఏ ప్రైవేటీకరణకు నలుగురు బిడ్డర్లు ముందస్తు అర్హత సాధించగా, ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ తొలిస్థానంలో నిలిచింది. అయితే, అవసరమైన నగదు డిపాజిట్ చెల్లించాల్సిన గడువు ముగుస్తున్న సమయంలో ఈ ప్రక్రియ నుంచి వైదొలుగుతున్నట్లు ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ ప్రకటించింది.

దీంతో ప్రస్తుతం మిగిలిన ముగ్గురు బిడ్డర్లు మాత్రమే రేసులో ఉన్నారు. వీరంతా డిసెంబర్ 23వ తేదీ నాటికి తమ సీల్డ్ బిడ్లను సమర్పించాల్సి ఉంటుందని పాక్ అధికారులు వెల్లడించారు.

దిగజారిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి పాక్ ప్రభుత్వం నిధులు సమకూర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, ఈ నిధుల విడుదలకు షరతుగా ఐఎంఎఫ్ సూచించిన సంస్కరణలను అమలు చేసేందుకు పాక్ ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ప్రభుత్వ రంగంలోని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటీకరించాలని కీలక నిర్ణయం తీసుకుంది. 


More Telugu News