దివ్యాంగ విద్యార్థినులపై లైంగిక దాడి.. ప్రిన్సిపాల్, టీచర్‌కు ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష

  • ఉపాధ్యాయులను దేవుళ్లుగా భావిస్తే వారే ద్రోహం చేశారని కోర్టు ఆవేదన
  • నిందితులు వృద్ధులు కావడంతో కనీస శిక్ష విధిస్తున్నట్లు వెల్లడి
  • బాధితులకు తగిన నష్టపరిహారం అందించాలని జిల్లా న్యాయ సేవా సంస్థకు ఆదేశం
ప్రత్యేక అవసరాలు గల మైనర్ విద్యార్థినులపై లైంగిక దాడి, వేధింపులకు పాల్పడిన కేసులో ఓ పాఠశాల ప్రిన్సిపాల్, రిటైర్డ్ టీచర్‌ను ముంబైలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. నిందితులిద్దరికీ ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

2013లో మాటలు, వినికిడి లోపం ఉన్న 13 ఏళ్ల బాలికను ప్రిన్సిపాల్ తన ఆఫీసుకు పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తనలాగే ఇతర విద్యార్థినులను కూడా వేధిస్తున్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. స్కూల్ నుంచి బహిష్కరిస్తారనే భయంతో బాధితులు ఈ విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఇదే పాఠశాలలో పనిచేసే మరో ఉపాధ్యాయుడు కూడా విద్యార్థినులను వేధించేవాడు.

2014 మే నెలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ నిందితుల ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో బాధితులు, వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు నిందితులను దోషులుగా తేల్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి సత్యనారాయణ ఆర్. నవందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

"పాఠశాల ఒక పవిత్ర స్థలం. పిల్లలు ఉపాధ్యాయులను మార్గదర్శకులుగా, దైవంగా భావిస్తారు. అలాంటి నమ్మకానికే ద్రోహం చేసి, వారే లైంగికంగా హింసిస్తే బాధితులు జీవితాంతం ఆ గాయంతో జీవించాల్సి వస్తుంది" అని న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులు వృద్ధులు కావడంతో పోక్సో చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం కనీస శిక్ష విధిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, నిందితుల నుంచి వసూలు చేసిన జరిమానా (ఒక్కో బాధితురాలికి రూ. 15,000) ఏమాత్రం సరిపోదని వ్యాఖ్యానించిన కోర్టు.. బాధితులకు తగిన నష్టపరిహారం అందించాలని జిల్లా న్యాయ సేవా సంస్థను (DLSA) ఆదేశించింది.


More Telugu News