బంగ్లాదేశ్ లో అదుపు తప్పుతున్న పరిస్థితులు... తమ పౌరులకు అలర్ట్ జారీ చేసిన అమెరికా

  • ఇంక్విలాబ్ మంచ్ నేత హాదీ మృతితో బంగ్లాదేశ్‌లో హింస
  • భారత వ్యతిరేకిగా ముద్రపడ్డ హాదీ
  • తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అమెరికా
  • బ్రిటన్ కూడా ట్రావెల్ అడ్వైజరీ జారీ
  • శనివారం జరగనున్న హాదీ అంత్యక్రియలు, భారీగా ట్రాఫిక్ జామ్ అవకాశం
  • దేశంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితి
పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాడికల్ సంస్థ ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతితో దేశవ్యాప్తంగా హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో అమెరికా, బ్రిటన్ తమ దేశ పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. అప్రమత్తంగా ఉండాలని, పెద్ద సభలు, ప్రదర్శనలకు దూరంగా ఉండాలని సూచించాయి.

తీవ్ర గాయాలతో సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హాదీ, ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడి శుక్రవారం కన్నుమూశాడు. ఈ విషయాన్ని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ గురువారం రాత్రి అధికారికంగా ధృవీకరించారు.

హాదీ మృతదేహం శుక్రవారం సాయంత్రం ఢాకాకు చేరుకోనుందని, శనివారం జాతీయ పార్లమెంట్ భవనం ముందు అంత్యక్రియల ప్రార్థనలు జరిగే అవకాశం ఉందని ఢాకాలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ఈ కారణంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు, ప్రదర్శనలు జరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. శాంతియుతంగా తలపెట్టిన కార్యక్రమాలు కూడా హింసాత్మకంగా మారవచ్చని, కాబట్టి అమెరికా పౌరులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరింది.

బ్రిటన్ విదేశాంగ కార్యాలయం కూడా తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ముఖ్యంగా హింసాత్మక ఘటనలు ఎక్కువగా నమోదవుతున్న చిట్టగాంగ్ కొండ ప్రాంతాలకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. 

అటు, హాదీ మృతికి సంతాపంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం శనివారం (డిసెంబర్ 20) జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని నివేదికలు వస్తున్నాయి.


More Telugu News