Nimmala Ramanayudu: కాపుల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు: నిమ్మల రామానాయుడు

Nimmala Ramanayudu Slams YSRCP on Kapu Welfare
  • అంబటి వ్యాఖ్యల వెనుక జగన్మోహన్ రెడ్డి దర్శకత్వం ఉందన్న నిమ్మల
  • తిరుమల నెయ్యి కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ డ్రామా అని ఆరోపణ 
  • కాపుల రిజర్వేషన్లను పునరుద్ధరించింది టీడీపీ అయితే రద్దు చేసింది వైసీపీ అని వెల్లడి
  • వంగవీటి రంగాను అవమానించిన వారికి వైసీపీలో పెద్దపీట అని విమర్శలు
కాపుల సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి ఏమాత్రం లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాపుల భవిష్యత్తు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే మాజీ మంత్రి అంబటి రాంబాబును అడ్డం పెట్టుకుని వైసీపీ నీచ రాజకీయాలు చేస్తోందని రామానాయుడు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దివంగత తల్లిదండ్రులను ఉద్దేశించి అంబటి వాడిన భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉందని, అంత దారుణంగా మాట్లాడుతున్నా జగన్ ఎందుకు వారించలేదని ప్రశ్నించారు. ఇది జగన్ దర్శకత్వంలోనే జరుగుతున్న డ్రామా అని స్పష్టమవుతోందన్నారు.

చరిత్రను గుర్తుంచుకోవాలి

చరిత్రను గుర్తుచేస్తూ.. బ్రిటిష్ కాలం నుంచి ఉన్న కాపు రిజర్వేషన్లను కాంగ్రెస్ ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి రద్దు చేస్తే, దామోదరం సంజీవయ్య, చంద్రబాబు మాత్రమే వాటిని పునరుద్ధరించారని రామానాయుడు తెలిపారు. చంద్రబాబు ఎంతో కష్టపడి కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే, అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ వాటిని రద్దు చేసి కాపులకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. కాపుల ఆరాధ్య దైవం వంగవీటి మోహన రంగాను 'రౌడీ' అని, 'చంపితే తప్పేంటి' అని అన్న గౌతమ్ రెడ్డికి ఆరు నెలల్లోనే ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవి ఇచ్చి జగన్ సత్కరించారని మండిపడ్డారు. రంగా హత్యలో నిందితులుగా ఉన్నవారు వైసీపీ ప్రెస్‌మీట్లలో పక్కన కూర్చుని నీతులు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కాపుల కోసం పోరాడుతానన్న ముద్రగడ పద్మనాభం తన పేరు చివర 'రెడ్డి' అని తగిలించుకున్న తర్వాత కాపుల గురించి మాట్లాడటం ఆయన మనస్సాక్షికే వదిలేస్తున్నామన్నారు.

బూతుల వల్లే వైసీపీ ఓటమి

అంబటి రాంబాబు, జోగి రమేశ్, కొడాలి నాని వంటి నేతల బూతుల పురాణం కారణంగానే వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందని, అధికారం కోల్పోయినా వారిలో మార్పు రాలేదని విమర్శించారు. లోకేశ్ పై జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలను మహిళాలోకం అసహ్యించుకుంటోందన్నారు. తప్పు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటే దానికి కులాన్ని ఆపాదించడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పల్నాడు వెళ్లిన టీడీపీ నేతలు బొండా ఉమ (కాపు), బుద్ధా వెంకన్న (బీసీ)పై రాడ్లతో దాడి చేయించినప్పుడు జగన్‌కు వారి కులాలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు.

చట్టం తనపని తాను చేసుకుపోతుంది

గతంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి చేసినప్పుడు అధికారంలో ఉన్న బొత్స సత్యనారాయణకు చట్టం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడూ శాంతిభద్రతలకే పెద్దపీట వేస్తారని, తప్పు ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని రామానాయుడు గుర్తుచేశారు. రంగాను అవమానించిన వారికి అండగా నిలుస్తున్న వైసీపీకి ఆయన పేరును ఉచ్ఛరించే హక్కు కూడా లేదని, అభివృద్ధిని పక్కనపెట్టి కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ నైజమని మంత్రి తీవ్రంగా విమర్శించారు.
Nimmala Ramanayudu
Kapu Community
YS Jagan Mohan Reddy
Chandrababu Naidu
TDP
YSRCP
Andhra Pradesh Politics
Kapu Reservations
Vangaveeti Ranga
Ambati Rambabu

More Telugu News