బంగ్లాదేశ్ లో తాజా అల్లర్ల వెనుక ఉన్నది ఎవరో గుర్తించిన భారత ఏజెన్సీలు!

  • బంగ్లాదేశ్ హింస వెనుక పాకిస్థాన్ ఐఎస్ఐ హస్తం
  • సోషల్ మీడియాలో భారత్‌కు వ్యతిరేకంగా ఫేక్ ప్రచారం
  • జమాత్-ఎ-ఇస్లామీని తెరవెనుక ఉంచి కుట్ర అమలు
  • బంగ్లాను అస్థిరపరిచి, ఎన్నికలు జరగకుండా అడ్డుకోవడమే లక్ష్యం
బంగ్లాదేశ్‌లో విద్యార్థి ఉద్యమ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ మరణం తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన హింస వెనుక పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్నట్టు స్పష్టమవుతోంది. భారత్‌కు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఫేక్ ప్రచారాన్ని వ్యాప్తి చేస్తూ, ఐఎస్ఐ మద్దతు ఉన్న సోషల్ మీడియా హ్యాండిల్స్ ఈ హింసకు ఆజ్యం పోశాయని భారత ఏజెన్సీలు గుర్తించాయి.

బంగ్లాదేశ్‌ను పూర్తి అల్లకల్లోలం చేయడమే లక్ష్యంగా ఐఎస్ఐ ఈ కుట్రకు పక్కా ప్రణాళిక రచించింది. ఈ ఆందోళనలకు జమాత్-ఎ-ఇస్లామీ, దాని విద్యార్థి విభాగం ఇస్లామిక్ ఛాత్రా శిబిర్ (ICS) నాయకత్వం వహించకుండా, ఈ రెండు సంస్థలను ఐఎస్ఐ తెరవెనుక ఉంచింది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి, దాని ఆధారంగా హింసను ప్రేరేపించే బాధ్యతను మాత్రమే ఆయా సంస్థలకు అప్పగించింది.

ఈ కుట్రలో భాగంగా, పాక్ నిధులతో నడిచే కొన్ని మీడియా సంస్థలు కూడా పాలుపంచుకున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారతదేశం రక్షణ కల్పిస్తోందన్న కోణంలో కథనాలను ప్రచురించి, ప్రజల్లో భారత వ్యతిరేక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాయి. గత ఆగస్టులో పదవీచ్యుతురాలైన షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.

తక్కువ ఖర్చుతో బంగ్లాదేశ్‌లో అస్థిరత సృష్టించి, దానిని తమ క్రీడాస్థలిగా మార్చుకోవాలనేది పాకిస్థాన్ దీర్ఘకాలిక వ్యూహంగా కనిపిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే, బంగ్లాదేశ్ భవిష్యత్తులో మరో పాకిస్థాన్‌లా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో ఎన్నికలను అడ్డుకొని, కశ్మీర్‌లో మాదిరిగా వేర్పాటువాదానికి బీజాలు వేయాలని ఐఎస్ఐ చూస్తోందని, అంతిమంగా బంగ్లాదేశ్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చాలనేది రాడికల్ శక్తుల లక్ష్యమని ఓ అధికారి వివరించారు.


More Telugu News