ఆ రెండు నగరాల్లో మెట్రో రైలు సేవలు అత్యంత ఆవశ్యకం: కేంద్రమంత్రి ఖట్టర్ కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

  • కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఖట్టర్‌తో సీఎం చంద్రబాబు భేటీ
  • విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై కీలక చర్చ
  • మెట్రో ప్రాజెక్టులను వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి
  • కేంద్రానికి సవరించిన డీపీఆర్‌లు పంపినట్టు వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా, శుక్రవారం కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడలలో మెట్రో రైలు ప్రాజెక్టులను వెంటనే ఆమోదించాలని కేంద్ర మంత్రిని కోరారు.

ఈ రెండు నగరాల్లో పెరుగుతున్న జనాభా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు సేవలు అత్యంత ఆవశ్యకమని చంద్రబాబు మంత్రికి వివరించారు. మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి సవరించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్) ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు పంపినట్లు ఆయన తెలిపారు.

ఈ డీపీఆర్‌లను క్షుణ్ణంగా పరిశీలించి, వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పట్టణ రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రి దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.


More Telugu News