హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రూ.400 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

  • పాతబస్తీలో 7 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
  • భూమి విలువ రూ.400 కోట్లు ఉంటుందని అంచనా
  • దశాబ్దాలుగా కబ్జాలో ఉంచిన వారిని ఖాళీ చేయించిన అధికారులు
  • హైడ్రా చర్యలపై స్థానిక ప్రజల హర్షం
  • చెరువు, నాలాలను కూడా పునరుద్ధరించాలని విజ్ఞప్తి
హైదరాబాద్ పాతబస్తీలో దశాబ్దాలుగా కబ్జాలో ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమికి విముక్తి లభించింది. సుమారు రూ.400 కోట్ల విలువైన 7 ఎకరాల స్థలాన్ని హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్ అథారిటీ (హైడ్రా) శుక్రవారం స్వాధీనం చేసుకుంది. కోర్టు కేసులు, పోలీసు ఫిర్యాదులను సైతం లెక్కచేయకుండా ఆక్రమణదారులు ఏర్పాటు చేసిన ఇనుప రేకుల ప్రహరీని తొలగించి, ఆ స్థలం ప్రభుత్వానిదని బోర్డులు ఏర్పాటు చేశారు.

బండ్లగూడ మండలం, కందికల్ గ్రామంలోని మహమ్మద్‌నగర్-లలితాబాగ్‌ ప్రాంతంలో సర్వే నంబర్ 28లో మొత్తం 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే 2 ఎకరాలు కబ్జాకు గురై నివాసాలు వెలిశాయి. మిగిలిన 7 ఎకరాలను ఆర్. వెంకటేష్ కుటుంబ సభ్యులు, వారి నుంచి కొనుగోలు చేశానని చెబుతున్న పట్టాభి రామిరెడ్డి తమ ఆధీనంలో ఉంచుకున్నారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాపుల ప్రకారం ఇక్కడ ఒక చెరువు ఉండేదని, దానిని కబ్జాదారులు మట్టితో పూడ్చివేశారని అధికారులు గుర్తించారు.

ఈ ఆక్రమణలపై గతంలో రెవెన్యూ అధికారులు భవానీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ భూమిని తమదని వాదిస్తూ కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు ఆక్రమణదారులకు న్యాయస్థానం కోటి రూపాయల జరిమానా కూడా విధించింది. అయినప్పటికీ వారు భూమిని ఖాళీ చేయలేదు.

తాజాగా హైడ్రా అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కబ్జాదారుల చెర నుంచి భూమిని విడిపించారు. ఈ చర్యపై స్థానికులు, కుమ్మరివాడి పీస్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇక్కడి చెరువు, నాలాలను పునరుద్ధరిస్తే వరద ముప్పు తప్పుతుందని స్థానికులు కోరుతున్నారు.


More Telugu News