బుర్జ్ ఖలీఫా రికార్డు బ్రేక్.. కిలోమీటరు ఎత్తుతో 'జెడ్డా టవర్' నిర్మాణం!

  • ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా జెడ్డా టవర్ నిర్మాణం
  • దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా రికార్డును బద్దలు కొట్టనున్న సౌదీ ప్రాజెక్ట్
  • 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం.. ఇప్పటికే 80 అంతస్తులు పూర్తి
  • కిలోమీటర్ ఎత్తుతో 160కి పైగా అంతస్తులు ఉండనున్న టవర్
  • సౌదీ విజన్ 2030లో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న క‌ట్ట‌డం
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డు సృష్టించేందుకు సౌదీ అరేబియా చేపట్టిన జెడ్డా టవర్ (కింగ్‌డమ్ టవర్) నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 2025 జనవరిలో తిరిగి ప్రారంభమైన పనులు ఇప్పటికే దాదాపు 80 అంతస్తులు పూర్తి చేసుకున్నాయి. ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒక కొత్త అంతస్తును నిర్మిస్తూ, 2028 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన కట్టడంగా ఉన్న దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా (828 మీటర్లు) రికార్డును జెడ్డా టవర్ బద్దలు కొట్టనుంది. దీని ఎత్తు 1,000 మీటర్లకు (ఒక కిలోమీటర్) పైగా ఉండనుంది. బుర్జ్ ఖలీఫా కంటే ఇది దాదాపు 172 నుంచి 180 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంటుంది. ఈ ఘనత సాధించిన తొలి భవనంగా జెడ్డా టవర్ చరిత్రకెక్కనుంది.

ఈ టవర్ ప్ర‌త్యేక‌త‌లివే..
సౌదీ అరేబియా ప్రతిష్ఠాత్మక 'విజన్ 2030'లో భాగంగా ఈ టవర్‌ను నిర్మిస్తున్నారు. 160కి పైగా అంతస్తులతో నిర్మితమవుతున్న ఈ భవనంలో విలాసవంతమైన ఫోర్ సీజన్స్ హోటల్, లగ్జరీ నివాసాలు, సర్వీస్డ్ అపార్ట్‌మెంట్లు, అత్యాధునిక ఆఫీసులు ఏర్పాటు చేయనున్నారు. ఎర్ర సముద్రం, నగరం అందాలను వీక్షించేందుకు ప్రత్యేకంగా స్కై-హై అబ్జర్వేషన్ డెక్‌ను నిర్మిస్తున్నారు. బుర్జ్ ఖలీఫా డిజైనర్లలో ఒకరైన ఆడ్రియన్ స్మిత్ ఈ టవర్‌కు రూపకల్పన చేయడం విశేషం. అంతేకాకుండా సౌదీ భవిష్యత్తులో రెండు కిలోమీటర్ల ఎత్తైన 'రైజ్ టవర్' నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.


More Telugu News