అద్భుతమైన వార్తను పంచుకున్నారు... ఆనంద్ మహీంద్రాకు థ్యాంక్స్ చెప్పిన సీఎం చంద్రబాబు

  • అంతర్జాతీయంగా సత్తా చాటుతున్న మన అరకు కాఫీ
  • నానోలాట్ సిరీస్ పేరుతో ప్రత్యేక కాఫీ.. కిలో ధర రూ. 10,000
  • ఆన్‌లైన్‌లో విడుదలైన గంటల వ్యవధిలోనే పూర్తి అమ్మకాలు
  • నాంది ఫౌండేషన్ 25 ఏళ్ల కృషి ఫలితమే ఈ విజయమన్న ఆనంద్ మహీంద్రా
  • ప్రత్యేక అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లోని అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ పొందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అరకు కాఫీకి చెందిన ‘నానోలాట్ సిరీస్’ విడుదలైన కొద్ది గంటల్లోనే అమ్ముడుపోవడంపై ఆయన స్పందించారు. ఈ శుభవార్తను పంచుకున్నందుకు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు ధన్యవాదాలు తెలిపారు. అరకు రైతులకు ఆనంద్ మహీంద్రా అందిస్తున్న నిరంతర మద్దతును చంద్రబాబు ప్రశంసించారు. ఒక సిరీస్ విడుదలైన ఒక్క రోజులో, మరొకటి కేవలం కొన్ని గంటల్లో అమ్ముడుపోవడం అరకు కాఫీ ప్రత్యేకతకు లభిస్తున్న ప్రపంచ స్థాయి గుర్తింపునకు నిదర్శనమని అన్నారు. అరకు కాఫీని ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్‌గా తీర్చిదిద్దిన నాంది ఫౌండేషన్‌కు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

అంతకుముందు, అరకు కాఫీ తాజా ఘనత గురించి ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. "ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ ఖ్యాతి మరోసారి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఇక్కడి కాఫీ బ్రాండ్ 'అరకు కాఫీ' సరికొత్త రికార్డు సృష్టించింది. తాజాగా విడుదల చేసిన 'నానోలాట్ సిరీస్' కాఫీ కిలో ఏకంగా రూ. 10,000 ధర పలికింది. ఇంతటి ఖరీదైనప్పటికీ, ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన రెండో విడత కాఫీ కేవలం రెండు గంటల్లోనే పూర్తిగా అమ్ముడుపోవడం విశేషం. తొలి విడత కాఫీ 24 గంటల్లోనే అమ్ముడైంది.

అత్యంత అరుదైన, స్వచ్ఛమైన కాఫీగా ఈ నానోలాట్ సిరీస్‌ను పరిచయం చేశారు. ఒక్కో రైతు తమకు కేటాయించిన చిన్న చిన్న క్షేత్రాల్లో, చాలా తక్కువ పరిమాణంలో ఈ కాఫీని పండిస్తారు. ఆ గింజలను మైక్రో-బ్యాచ్‌లలో వేయించి, వాటి సహజమైన రుచి, సువాసనలు కోల్పోకుండా ప్యాక్ చేస్తారు. అందుకే దీనికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంతటి డిమాండ్ ఏర్పడింది. భారతీయ అరేబికా కాఫీకి ఇప్పటివరకు లభించిన అత్యధిక ధరలలో ఇది ఒకటిగా నిలిచింది.

ఈ అద్భుత విజయం వెనుక నాంది ఫౌండేషన్ 25 ఏళ్ల అవిశ్రాంత కృషి ఉంది. అరకు లోయలోని గిరిజన రైతుల జీవితాలను మార్చేందుకు ఈ సంస్థ విశేషంగా పనిచేస్తోంది. సాధారణంగా ద్రాక్ష సాగులో వాడే 'టెర్రొయిర్' (Terroir) అనే ప్రత్యేక పద్ధతిని కాఫీ సాగులో ప్రవేశపెట్టింది. స్థానిక నేల, సూక్ష్మ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులను మార్చడం ద్వారా అరకు కాఫీకి ప్రపంచస్థాయి గుర్తింపును తీసుకొచ్చింది. ఈ ఘనత సాధించిన నాంది ఫౌండేషన్ అధిపతి మనోజ్ కుమార్ బృందానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి" అని ఆనంద్ మహీంద్రా వివరించారు.


More Telugu News