కొడుకు సమాధికి సీసీ కెమెరా ఏర్పాటు.. కారణం తెలిసి అంతా షాక్!

  • అనారోగ్యంతో చనిపోయిన ఆరేళ్ల కొడుకు
  • సమాధి వద్ద సోలార్ సీసీ కెమెరా ఏర్పాటు చేసిన తండ్రి
  • క్షుద్ర పూజల భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
  • ఫుటేజీని మొబైల్‌లో రోజూ పర్యవేక్షిస్తున్న కుటుంబం
కన్నకొడుకు మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన ఓ తండ్రి.. తన బిడ్డ సమాధికి సీసీ కెమెరా ఏర్పాటు చేసిన ఘటన తిరుపతి జిల్లాలో వెలుగుచూసింది. క్షుద్ర పూజల కోసం తన కుమారుడి మృతదేహాన్ని ఎవరైనా తవ్వేస్తారేమోనన్న భయంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వింత ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లికి చెందిన దంపతుల ఆరేళ్ల కుమారుడు ఈ నెల 8వ తేదీన అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. బాలుడిని ఊరి పొలిమేరల్లోని శ్మశానవాటికలో ఖననం చేశారు. అయితే, కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని ఆ తండ్రి, సమాధి భద్రతపై ఆందోళన చెందాడు.

క్షుద్ర పూజలు చేసేవాళ్లు తన బిడ్డ మృతదేహాన్ని తవ్వేస్తారనే అనుమానంతో సమాధి వద్ద సోలార్‌తో పనిచేసే సీసీ కెమెరాను ఏర్పాటు చేశాడు. దాని ఫుటేజీని రోజూ తన మొబైల్ ఫోన్‌లో చూస్తూ పర్యవేక్షిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. చంద్రగిరి మండలంలో క్షుద్ర పూజల వంటి కార్యకలాపాలు జరగవని, ఈ విషయంలో ఆ కుటుంబానికి అవగాహన కల్పిస్తామని వారు తెలిపారు. అయినప్పటికీ పుత్రశోకంలో ఉన్న ఆ తండ్రి మాత్రం తన కొడుకు సమాధికి రక్షణగా సీసీ కెమెరా నిఘాను కొనసాగిస్తూనే ఉన్నారు.


More Telugu News