బంగ్లాదేశ్‌లో భారత హైకమిషన్‌పై దాడి.. కార్యకర్త మృతితో హింస

  • బంగ్లాదేశ్‌లో భారత సహాయ హైకమిషన్‌పై రాళ్ల దాడి
  • భారత వ్యతిరేక కార్యకర్త హదీ మృతితో చెలరేగిన హింస
  • పత్రికా కార్యాలయాలు, షేక్ ముజిబుర్ నివాసం ధ్వంసం
  • చిట్టగాంగ్, రాజ్‌షాహీ సహా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు
బంగ్లాదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. భారత వ్యతిరేక కార్యకర్తగా పేరుపొందిన షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యకు నిరసనగా చెలరేగిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. చిట్టగాంగ్‌లోని భారత సహాయ హైకమిషన్ కార్యాలయంపై నిరసనకారులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనతో బంగ్లాదేశ్‌లోని పలు నగరాల్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది.

స్థానిక పోలీసులు, మీడియా కథనాల ప్రకారం.. హదీ మరణవార్త తెలియగానే నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. చిట్టగాంగ్‌లోని భారత దౌత్య కార్యాలయం, అధికారిక నివాసం సమీపంలో గుమిగూడిన ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కనిపించాయని, దహనకాండ కూడా జరిగినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు, ఎలాంటి నష్టం జరగకుండా హైకమిషన్ వద్ద భారీ భద్రతను మోహరించారు.

హదీ మరణం తర్వాత రాత్రికి రాత్రే ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. 'ప్రథమ్ ఆలో', 'ది డైలీ స్టార్' వంటి ప్రముఖ పత్రికా కార్యాలయాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. అలాగే, ధన్‌మండిలోని షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసం, ఛాయానాట్ సాంస్కృతిక భవన్‌పై కూడా దాడులు జరిగాయి. చిట్టగాంగ్‌తో పాటు రాజ్‌షాహీ, ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి దాడులు జరిగినట్లు సమాచారం.


More Telugu News