రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'గుర్రం పాపిరెడ్డి'

  • డార్క్‌ కామెడీ జోనర్‌లో వస్తున్న 'గుర్రం పాపిరెడ్డి'
  • ప్రీ-రిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మానందం
  • నరేష్, ఫరియా ఓల్డ్‌ ఏజ్‌ గెటప్స్‌ అద్భుతమన్న హాస్యబ్రహ్మ
  • సినిమాలో పాట రాసి, పాడి, కొరియోగ్రఫీ చేసిన ఫరియా
  • ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం
నరేష్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన వైవిధ్యమైన చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’. డార్క్‌ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా రేపు (డిసెంబరు 19) విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ నిర్వహించిన ప్రీ-రిలీజ్‌ ప్రెస్‌ మీట్‌కు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ చిత్రంలో ఆయన కీలకమైన జడ్జి పాత్రలో కనిపించనున్నారు.

ఈ వేడుకలో బ్రహ్మానందం మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "ఈ సినిమా కథను ప్రేక్షకులకు వివరించే కీలక బాధ్యత నా పాత్రదే. దర్శకుడు మురళీ మనోహర్‌ ఈ తరం ప్రేక్షకులకు నచ్చే సరికొత్త కథాంశాన్ని ఎంచుకున్నారు. ముఖ్యంగా నరేష్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా తమ పాత్రల కోసం ఎంతో కష్టపడ్డారు. వారి ఓల్డ్‌ ఏజ్‌ గెటప్స్‌ చూసి మొదట నేను గుర్తుపట్టలేకపోయాను" అని ప్రశంసించారు.

ఈ చిత్రంలో తమిళ కమెడియన్ యోగి బాబు పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, ఆయన తనదైన శైలిలో నవ్వులు పంచుతారని బ్రహ్మానందం తెలిపారు. 'సౌదామిని' అనే పాత్రలో నటిస్తున్న ఫరియా అబ్దుల్లా ఈ చిత్రంలో కేవలం నటించడమే కాకుండా, ఒక పాటను స్వయంగా రాసి, పాడి, కొరియోగ్రఫీ కూడా చేయడం విశేషం.

డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్‌ బురా, జయకాంత్‌ (బాబీ) ఈ చిత్రాన్ని నిర్మించారు. వినూత్న కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.


More Telugu News