యజమానులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్... ఉద్యోగుల నమోదుకు 6 నెలల సమయం

  • ఉద్యోగుల నమోదుకు 'ఈఈఎస్-2025' పేరుతో ఈపీఎఫ్ఓ ప్రత్యేక పథకం
  • నవంబర్ నుంచి ఆరు నెలల పాటు యజమానులకు అవకాశం
  • 2017 జూలై నుంచి 2025 అక్టోబర్ మధ్య చేరని ఉద్యోగులకు లబ్ధి
  • కేవలం రూ.100 నామమాత్రపు జరిమానాతో పాత బకాయిల చెల్లింపు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తాజాగా సంస్థల యజమానులకు ఒక కీలకమైన అవకాశాన్ని కల్పించింది. గతంలో వివిధ కారణాల వల్ల తమ ఉద్యోగులను ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) పరిధిలోకి తీసుకురాలేని సంస్థల కోసం 'ఎంప్లాయీస్ ఎన్‌రోల్‌మెంట్ స్కీమ్ (ఈఈఎస్)-2025' పేరుతో ఒక ప్రత్యేక పథకాన్ని గురువారం ప్రకటించింది. దీని కింద అర్హులైన ఉద్యోగులను స్వచ్ఛందంగా పీఎఫ్ ఖాతాలో నమోదు చేయడానికి యజమానులకు ఆరు నెలల సమయం ఇచ్చింది.

ఈ పథకం 2025 నవంబర్ నుంచి ఆరు నెలల పాటు అమల్లో ఉంటుంది. 2017 జూలై 1 నుంచి 2025 అక్టోబర్ 31 మధ్య కాలంలో పీఎఫ్ పరిధిలోకి రాని ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పాత బకాయిలను సులభంగా చెల్లించవచ్చని ఈపీఎఫ్ఓ సూచించింది. 

ఈ పథకం కింద యజమానులకు భారీ ఊరట కల్పించారు. గతంలో ఉద్యోగి వాటాను జీతం నుంచి మినహాయించని పక్షంలో, యజమాని కేవలం తన వాటా, వర్తించే వడ్డీ, పరిపాలనా ఛార్జీలతో పాటు నామమాత్రంగా రూ.100 జరిమానా చెల్లిస్తే సరిపోతుంది.

ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న సంస్థలు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. 'అందరికీ సామాజిక భద్రత' అనే జాతీయ లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ పథకంపై యజమానుల్లో అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు, ఎస్ఎంఎస్, ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం అందిస్తామని పేర్కొంది.


More Telugu News