కడియం శ్రీహరి చరిత్రహీనుడు.. రాజీనామా చేయాలి: తాటికొండ రాజయ్య

  • తాను బీఆర్ఎస్ సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదన్న కడియం
  • బీఆర్ఎస్‌లోనే ఉన్నానని చెప్పుకోవడం సిగ్గుచేటన్న రాజయ్య
  • ప్రతి వీధిలో శ్రీహరి దిష్టిబొమ్మలు వేలాడదీస్తామని హెచ్చరిక
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన నోటీసులకు కడియం చరిత్రహీనుడిలా వివరణ ఇచ్చారని మండిపడ్డారు. ఈరోజు వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన రాజయ్య... కడియం శ్రీహరి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

"అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లోకి వెళ్తున్నానని చెప్పి, ఇప్పుడు బీఆర్ఎస్‌లోనే ఉన్నానని చెప్పడం సిగ్గుచేటు. ఏమాత్రం నైతిక విలువలున్నా కడియం శ్రీహరి వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ పార్టీకి చేసిన ద్రోహానికి ముందుగా క్షమాపణ చెప్పాలి" అని రాజయ్య డిమాండ్ చేశారు. రాజీనామా చేయని పక్షంలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ప్రతి వీధిలో ఆయన దిష్టిబొమ్మలు వేలాడదీస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

మరోవైపు, స్పీకర్ నోటీసులపై కడియం శ్రీహరి బుధవారం లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. తాను కాంగ్రెస్‌లో చేరలేదని, బీఆర్ఎస్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసుకోలేదని తన వివరణలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని, కేవలం తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కడియం వివరణపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.


More Telugu News