శ్రీవారి ఆలయం ఎదుట రాజకీయ పోస్టర్ తో రీల్.. భక్తుల ఆగ్రహం

  • అన్నాడీఎంకే నేతల పోస్టర్ తో తమిళనాడు భక్తుల పోజులు
  • రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైనం
  • అధికారులు ఏం చేస్తున్నారంటూ మండిపడుతున్న భక్తులు
తిరుమల కొండపై తమిళనాడుకు చెందిన భక్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రాజకీయ నేతల పోస్టర్ తో రీల్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో టీటీడీ అధికారులపై శ్రీవారి భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. కొండపై రాజకీయ ప్రచారం, పోస్టర్లపై నిషేధం అమలు చేయడంలో వారు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొండపై శ్రీవారి ఆలయం ఎదుట తమిళనాడుకు చెందిన భక్తులు అన్నాడీఎంకే పోస్టర్లను ప్రదర్శిస్తూ వీడియో తీశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలితతో పాటు పళనిస్వామి తదితర అన్నాడీఎంకే పార్టీ నేతల ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీని ప్రదర్శించారు. ఈ ఘటనపై టీటీడీ స్పందించింది.

తమిళనాడుకు చెందిన భక్తులు శ్రీవారి ఆలయం ఎదుట అన్నాడీఎంకే బ్యానర్‌ను ప్రదర్శించిన విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. బ్యానర్‌ను ప్రదర్శించడమే కాకుండా రీల్స్‌ తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారని గుర్తించినట్లు తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ భక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ సీపీఆర్వో ఓ ప్రకటనలో తెలిపారు.


More Telugu News