పాక్‌లో 'ధురంధర్' సంచలనం.. నిషేధాన్ని లెక్కచేయని జనం.. చేతులెత్తేసిన ఐఎస్ఐ!

  • పాక్‌లో నిషేధానికి గురైన భారత చిత్రం ‘ధురంధర్’
  • పైరసీలో సరికొత్త రికార్డులు... రెండు వారాల్లో 20 లక్షల డౌన్‌లోడ్లు
  • సినిమాను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన ఐఎస్ఐ
భారత చిత్రం ‘ధురంధర్’పై పాకిస్థాన్, కొన్ని గల్ఫ్ దేశాలు నిషేధం విధించినా దాని ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. పైగా పాకిస్థాన్‌లో ఈ సినిమా సృష్టిస్తున్న ప్రకంపనలు అక్కడి నిఘా సంస్థ ఐఎస్ఐకి పెద్ద తలనొప్పిగా మారాయి. సినిమాను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో డిజిటల్ ప్రపంచంపై ఐఎస్ఐ పట్టు కోల్పోయినట్లు స్పష్టమవుతోంది.

1999 నాటి ఖాందహార్ విమాన హైజాక్, ముంబై 26/11 దాడులు, కరాచీలోని లియారి గ్యాంగ్ వార్స్ వంటి సున్నితమైన అంశాలను ఈ చిత్రంలో చూపించడంతో పాక్ ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది. అయితే, కేవలం రెండు వారాల్లోనే పాకిస్థాన్‌లో దాదాపు 20 లక్షల ఇల్లీగల్ డౌన్‌లోడ్లు నమోదయ్యాయి. దీంతో ‘2.0’, ‘రయీస్’ చిత్రాలను వెనక్కి నెట్టి పాక్‌లో అత్యధికంగా పైరసీకి గురైన సినిమాగా ‘ధురంధర్’ రికార్డు సృష్టించింది.

ఈ సినిమాపై పాక్ ప్రజల్లో ఉన్న ఆసక్తి కారణంగానే డౌన్‌లోడ్లు భారీగా పెరిగాయని అధికారులు చెబుతున్నారు. టెలిగ్రామ్ ఛానెళ్లు, టొరెంట్లు, వీపీఎన్ల ద్వారా శ్రీలంక, నేపాల్, మలేషియా సర్వర్లను ఉపయోగించి సినిమాను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఈ సినిమా కథనంతో కొందరు విభేదిస్తున్నప్పటికీ నటనను మాత్రం మెచ్చుకుంటున్నారు. చాలామంది పాకిస్థానీలు ఈ సినిమాపై మీమ్స్, రీల్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఈ పరిణామాలతో ఉక్కిరిబిక్కిరైన పాక్ ప్రభుత్వం, ‘ధురంధర్’ ప్రచారానికి కౌంటర్‌గా ‘మేరా లియారి’ అనే చిత్రాన్ని వేగంగా నిర్మిస్తోంది. "భారత సినిమా పరిశ్రమ పాకిస్థాన్‌పై, ముఖ్యంగా లియారిపై తప్పుడు ప్రచారం చేస్తోంది. లియారి అంటే హింస కాదు, సంస్కృతి, శాంతి. మా సినిమా నిజమైన లియారిని చూపిస్తుంది" అని సింధ్ ప్రావిన్షియల్ మంత్రి షర్జీల్ ఇనామ్ మెమన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. మరోవైపు సినిమాలో దివంగత నేత బెనజీర్ భుట్టో చిత్రాలను ఉపయోగించడంపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ చిత్రంలో భారత గూఢచారిగా రణవీర్ సింగ్ నటించగా, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు. మొత్తంగా సినిమాను అడ్డుకోవడంలో విఫలమవడమే కాకుండా ఎదురుదాడికి దిగడం పాక్ ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.


More Telugu News