కోహ్లీ, రోహిత్ విదేశీ లీగ్స్‌లో ఎందుకు ఆడరు?.. ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఏమ‌న్నారంటే..!

  • ఆటగాళ్ల వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ ప్రధాన కారణమని వెల్లడి
  • జాతీయ జట్టు ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత అన్న అరుణ్ ధుమాల్  
  • దేశవాళీ టోర్నీలు ఆడటం కూడా తప్పనిసరి అని సూచన
ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇతర టీ20 లీగ్స్‌తో పోలిస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రత్యేకత భారత ఆటగాళ్లు పాల్గొనడమే. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ వంటి స్టార్ క్రికెటర్లు కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడతారు. అయితే, సమీప భవిష్యత్తులో భారత ఆటగాళ్లను విదేశీ లీగ్స్‌లో ఆడేందుకు అనుమతించే ప్రసక్తే లేదని ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ స్పష్టం చేశారు. ఆటగాళ్ల పనిభారం (వర్క్‌లోడ్) నిర్వహణే దీనికి ప్రధాన కారణమని ఆయన తెలిపారు.

ఈ విషయంపై ఓ జర్నలిస్టుతో మాట్లాడుతూ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. "మన ఆటగాళ్ల పనిభారాన్ని గమనించండి. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే ఆటగాళ్లు తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ కూడా ఆడాలని బీసీసీఐ నిబంధన విధించింది. వారు విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ వంటి టోర్నీలలో పాల్గొనాల్సి ఉంటుంది. భారత్‌లోనే ఇంత క్రికెట్ ఉన్నప్పుడు, ఇక్కడే కోట్లాది మంది అభిమానులు ఉన్నప్పుడు.. వారికి విదేశీ లీగ్స్‌లో ఆడే అవకాశం ఉంటుందని నేను అనుకోవడం లేదు" అని తెలిపారు.

ముఖ్యంగా మూడు ఫార్మాట్లలో ఆడే స్టార్ ఆటగాళ్లకు ఇది మరింత కష్టమని ధుమాల్ పేర్కొన్నారు. "ప్రస్తుతానికి, పెద్ద ఆటగాళ్లకు విదేశాలకు వెళ్లే అవకాశం లేదు. వాళ్లు ఎలా వెళ్లగలరు? కొంతమంది మూడు ఫార్మాట్లలో ఆడుతున్నారు. వారికి వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యం" అని అన్నారు.

"కొంతమంది బౌలర్లకు రెండు టెస్టుల తర్వాత విశ్రాంతి ఇవ్వాల్సి వస్తోంది. వన్డేలు, టీ20లలో కూడా రెస్ట్ ఇస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వారిని విదేశాలకు వెళ్లి లీగ్స్ ఆడమంటే, అది జాతీయ జట్టు ప్రయోజనాలను దెబ్బతీస్తుంది" అని ధుమాల్ అభిప్రాయపడ్డారు. భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకుంటున్న జాగ్రత్తలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. కీలకమైన మ్యాచ్‌లకు సైతం అతడికి విశ్రాంతినిస్తూ పనిభారాన్ని నిర్వహిస్తున్నారు.


More Telugu News