87 ఏళ్ల వయసులో తండ్రయిన చైనా చిత్రకారుడు... భార్య వయసు 37... కానీ!

  • 87 ఏళ్ల వయసులో తండ్రైన చైనా ప్రముఖ చిత్రకారుడు ఫ్యాన్ జెంగ్
  • కొడుకు పుట్టినట్లు ప్రకటించి, కూతురు, పెంపుడు కొడుకును దూరం పెట్టిన వైనం
  • కొత్తగా పుట్టిన కొడుకే తన ఏకైక వారసుడని స్పష్టీకరణ
  • తన తండ్రి ప్రస్తుత భార్య తనను నియంత్రిస్తోందని కూతురు గతంలో ఆరోపణ
  • ఫ్యాన్ జెంగ్ చిత్రాలకు అంతర్జాతీయంగా వేల కోట్ల రూపాయల విలువ
చైనాకు చెందిన అత్యంత గౌరవనీయ సమకాలీన చిత్రకారుల్లో ఒకరైన ఫ్యాన్ జెంగ్ (87) వ్యక్తిగత జీవితం మరోసారి సంచలనంగా మారింది. 87 ఏళ్ల వయసులో తనకు ఒక కుమారుడు జన్మించాడని ప్రకటించిన ఆయన, అదే సమయంలో తన కూతురు, పెంపుడు కుమారుడితో అన్ని రకాల సంబంధాలు తెంచుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం, ఈ పరిణామం ఆయన కళా జీవితాన్ని పక్కకు నెట్టి వ్యక్తిగత వివాదాలను తెరపైకి తెచ్చింది.

ఫ్యాన్ జెంగ్ తన సాంప్రదాయ చైనీస్ పెయింటింగ్స్, కాలిగ్రఫీకి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. చైనా మీడియా నివేదికల ప్రకారం, 2008 నుంచి 2024 మధ్య కాలంలో ఆయన కళాఖండాలు వేలంలో 4 బిలియన్ యువాన్లు (సుమారు రూ. 4,700 కోట్లు) ఆర్జించాయి. ఆయన గీసిన అనేక చిత్రాలు 10 మిలియన్ యువాన్లకు పైగా పలికాయి. ముఖ్యంగా 1991లో గీసిన ఒక పెయింటింగ్, 2011లో బీజింగ్‌లో జరిగిన వేలంలో 18.4 మిలియన్ యువాన్ల రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఆయన కాలిగ్రఫీకి కూడా భారీ డిమాండ్ ఉంది.

డిసెంబర్ 11న సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ జెంగ్ ఒక ప్రకటన చేశారు. తన భార్య జు మెంగ్‌కు ఒక కుమారుడు జన్మించాడని, అతడే తన 'ఏకైక సంతానం' అని వెల్లడించారు. తాను, తన భార్య, కుమారుడు కొత్త ఇంట్లోకి మారామని తెలిపారు. వయసు పైబడటంతో కుటుంబ వ్యవహారాల నిర్వహణ బాధ్యతను పూర్తిగా తన భార్య జు మెంగ్‌కు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, ఆయన ప్రస్తుత భార్య జు మెంగ్‌ వయసు 37 ఏళ్లు.

అదే ప్రకటనలో, తన కూతురు ఫ్యాన్ జియావోహుయ్, పెంపుడు కుమారుడు ఫ్యాన్ జోంగ్డాతో పాటు వారి కుటుంబాలతో సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు తన కుటుంబంపై పుకార్లు వ్యాప్తి చేస్తూ హాని తలపెడుతున్నారని ఆరోపించారు. తన పేరు మీద వ్యవహరించడానికి తన పాత పిల్లలకు ఇచ్చిన అన్ని అధికారాలను రద్దు చేస్తున్నట్లు కూడా ఆయన తేల్చిచెప్పారు.

గత కొన్నేళ్లుగా ఫ్యాన్ జెంగ్ కుటుంబ వివాదాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో, ఆయన కూతురు జియావోహుయ్ మాట్లాడుతూ.. తన తండ్రిని కలవనివ్వడం లేదని, ఆయనను జు మెంగ్ తన నియంత్రణలో ఉంచుకుందని ఆరోపించారు. అంతేకాకుండా, తన తండ్రికి చెందిన 2 బిలియన్ యువాన్లు (దాదాపు రూ. 2,400 కోట్లు) విలువైన కళాఖండాలను జు మెంగ్ రహస్యంగా అమ్ముకుందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను ఫ్యాన్ జెంగ్ కంపెనీ అప్పట్లో ఖండించింది.

జియాంగ్సు ప్రావిన్స్‌లో జన్మించిన ఫ్యాన్ జెంగ్, బీజింగ్‌లోని సెంట్రల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చదువుకున్నారు. లి కెరన్, లి కుచన్ వంటి ప్రఖ్యాత కళాకారుల వద్ద శిక్షణ పొందారు. దశాబ్దాలుగా అంతర్జాతీయంగా ప్రదర్శనలు ఇస్తూ గొప్ప చిత్రకారుడిగా పేరు తెచ్చుకున్నారు. 


More Telugu News