కబడ్డీ ప్లేయర్ హత్య కేసు: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం

  • మొహాలీలో కబడ్డీ ప్లేయర్ హత్య
  • రెండు రోజులకే నిందితుడిని కాల్చి చంపిన పోలీసులు
  • ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలు
పంజాబ్‌లోని మొహాలీలో కబడ్డీ ఆటగాడి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులోని ప్రధాన నిందితుడు హర్పీందర్ అలియాస్ మిద్దు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఎదురుకాల్పుల సమయంలో తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు మొహాలీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు.

రెండు రోజుల క్రితం సోమవారం సాయంత్రం, మొహాలీలోని సోహానా ప్రాంతంలో జరుగుతున్న కబడ్డీ టోర్నమెంట్‌లో 30 ఏళ్ల కన్వర్ దిగ్విజయ్ సింగ్ అలియాస్ రాణా బాలాచౌరియాను దుండగులు కాల్చి చంపారు. బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి అతనిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో, రాణా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, హర్పీందర్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతడికి గతంలోనూ అనేక నేరాల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ హత్యలో పాల్గొన్న మరో ఇద్దరు షూటర్లను కూడా గుర్తించారు. అమృత్‌సర్‌కు చెందిన ఆదిత్య కపూర్ అలియాస్ మఖన్, కరణ్ పాఠక్ అలియాస్ డిఫాల్టర్ కరణ్‌గా వారిని గుర్తించి, గాలింపు చర్యలు చేపట్టారు.

కబడ్డీ టోర్నమెంట్లపై తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ఓ ముఠా ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. హత్యకు గురైన రాణా... జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ జగ్గూ భగవాన్‌పురియాకు సన్నిహితుడు కావడమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.


More Telugu News