గువాహటిలో రూ.10కే టిఫిన్.. పేదల ఆకలి తీరుస్తున్న మహిళ

  • గువాహటిలో రూ.10కే దోశ, ఇడ్లీ విక్రయం
  • యూట్యూబ్ చూసి వంటలు నేర్చుకున్న సన్నో కౌర్
  • పేదలు, విద్యార్థులకు తక్కువ ధరకే అల్పాహారం
  • కుటుంబ సభ్యుల సహాయంతో చిన్న హోటల్ నిర్వహణ
కనీసం ఒక కప్పు టీ తాగాలన్నా రూ.10 వెచ్చించాల్సిన ఈ రోజుల్లో, అదే ధరకు కడుపునిండా అల్పాహారం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు గువాహటికి చెందిన ఓ మహిళ. లాభార్జనను పక్కనపెట్టి సేవ చేయాలనే సంకల్పంతో విద్యార్థులు, పేదల ఆకలి తీరుస్తున్నారు.

గువాహటి క్లబ్ ఫ్లైఓవర్ వద్ద తెలుగు కాలనీ సమీపంలో 47 ఏళ్ల సన్నో కౌర్ ఓ చిన్న హోటల్‌ను నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్లెయిన్ దోశ, ఇడ్లీ కేవలం రూ.10కే లభిస్తాయి. వాటితో పాటు రుచికరమైన కొబ్బరి చట్నీ, సాంబార్ కూడా అందిస్తున్నారు. మసాలా దోశ రూ.20, ఎగ్ దోశ రూ.30, చీజ్ దోశ రూ.40, ఆలూ పరాఠా రూ.20 వంటి ఇతర టిఫిన్లను కూడా చాలా తక్కువ ధరలకే విక్రయిస్తున్నారు.

గతేడాది ప్రారంభించిన ఈ హోటల్ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. సన్నో కౌర్‌కు మొదట ఈ వంటలు చేయడం రాదు. కుటుంబ సభ్యుల కోసం యూట్యూబ్ చూసి నేర్చుకున్నారు. వారి ప్రోత్సాహంతోనే ఇంటి ముందు ఈ చిన్న దుకాణాన్ని ఏర్పాటు చేశారు. తన కుటుంబంలోని 14 మంది సభ్యులు హోటల్ నిర్వహణలో సహాయపడతారని ఆమె తెలిపారు.

"ప్రస్తుతం నిత్యావసరాలు, గ్యాస్ ధరలు పెరగడంతో ఈ ధరలకు టిఫిన్ అందించడం కొంచెం కష్టమే. అయినా ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. రోజుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఆదాయం వస్తుంది. భవిష్యత్తులో ధరలు పెంచాల్సి వచ్చినా, అందరికీ అందుబాటులోనే ఉండేలా చూస్తాను," అని సన్నో కౌర్ వివరించారు. ఈ హోటల్‌కు ఎక్కువగా విద్యార్థులు వస్తుంటారు. రూ.10-20తోనే తమ ఆకలి తీరుతోందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


More Telugu News