కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార మదంతో వ్యవహరిస్తున్నారు: కేటీఆర్

  • కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార గర్వం పెరిగిపోయిందన్న కేటీఆర్
  • ప్రభుత్వ నిధులు, ఇందిరమ్మ ఇళ్లు నేతల సొంత ఆస్తి కాదని స్పష్టీకరణ 
  • యూరియా కొరతను కప్పిపుచ్చుకునేందుకే కొత్త యాప్ డ్రామా
  • బీసీ రిజర్వేషన్లు తగ్గించి రేవంత్ రెడ్డి మోసం చేశారని విమర్శలు
  • మరో రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయం అని వ్యాఖ్యలు
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార మదంతో, పెత్తందారీ ధోరణితో వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ నేతల సొంత ఆస్తి కాదని, అవి ప్రజల సొమ్ము అని ఆయన స్పష్టం చేశారు.

ఇవాళ తెలంగాణ భవన్‌లో ఖానాపూర్, షాద్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభలో కేటీఆర్ మాట్లాడారు. "కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజలను, ప్రజాప్రతినిధులను చంపేస్తామంటూ బెదిరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు, అభివృద్ధి నిధులు కాంగ్రెస్ నేతల జాగీరు కాదు. లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారం రాజ్యాంగం ప్రకారం గ్రామసభలకు, సర్పంచ్‌లకే ఉంటుంది" అని కేటీఆర్ తేల్చి చెప్పారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక దుస్థితిని ఎద్దేవా చేసిన కేటీఆర్, కొందరు ఎమ్మెల్యేలు నిధుల కోసం ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాస్తున్నారని, మరికొందరు బహిరంగంగానే నిధుల కోసం వేడుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకే నిధులు లేనప్పుడు, గ్రామాలకు నిధులు మంజూరు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రూ. 3,500 కోట్లు పొందేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీ రిజర్వేషన్లను 24 శాతం నుంచి 17 శాతానికి తగ్గించి బీసీలను మోసం చేశారని ఆరోపించారు. చట్ట ప్రకారం ఈ నిధుల్లో 70 శాతం నేరుగా గ్రామ పంచాయతీలకే చెందాలని, దానిని అడ్డుకునే అధికారం ఎవరికీ లేదని తెలిపారు.

రైతుల సమస్యలపైనా కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ హయాంలో ఇంటి వద్దకే రైతుబంధు, ఎరువులు వచ్చేవని, ఇప్పుడు బస్తా యూరియా కోసం రైతులు రోడ్లపై కొట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. యూరియా కోసం ఏర్పడుతున్న పొడవైన క్యూలను దాచేందుకే ముఖ్యమంత్రి 'యూరియా యాప్' అనే డ్రామాకు తెరలేపారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు, రెండున్నరేళ్లలో కూలిపోవడం ఖాయమని, సర్పంచులు తమ పదవీకాలంలో చివరి రెండేళ్లు కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News