చాట్ జీపీటీలో ఈ కంటెంట్ కూడానా..?

  • చాట్‌జీపీటీలో 'అడల్ట్ మోడ్' తీసుకురానున్న ఓపెన్ఏఐ
  • 2026 మొదటి త్రైమాసికంలో ఈ ఫీచర్ ప్రారంభం
  • కేవలం వయసు నిర్ధారించిన పెద్దలకు మాత్రమే యాక్సెస్
  • మైనర్ల వినియోగాన్ని అడ్డుకునేందుకు కఠిన చర్యలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న ఓపెన్ఏఐ, తన చాట్‌జీపీటీలో మరో కీలక ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ప్రత్యేకించి వయోజనులను లక్ష్యంగా చేసుకుని 'అడల్ట్ మోడ్'ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్ 2026 మొదటి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

ఓపెన్ఏఐ అప్లికేషన్స్ సీఈఓ ఫిడ్జీ సిమో, కొత్త జీపీటీ-5.2 మోడల్‌పై జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. 'అడల్ట్ మోడ్' అనేది వయసు ధ్రువీకరించబడిన వయోజనులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. మైనర్లు దీనిని వినియోగించకుండా కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందుకోసం ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో ఇప్పటికే వయసు నిర్ధారణ ప్రక్రియను పరీక్షిస్తున్నట్లు వివరించారు.

ఈ ఫీచర్ వినియోగదారులందరికీ డిఫాల్ట్‌గా ఆఫ్ చేయబడి ఉంటుంది. అవసరమైన వారు ప్రత్యేకంగా అభ్యర్థించి, వయసు ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేస్తేనే 'అడల్ట్ మోడ్' కంటెంట్‌ను యాక్సెస్ చేయగలరు. ఈ మోడ్‌కు కొన్ని పరిమితులు ఉంటాయని సంస్థ తెలిపింది. ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ సైతం తన ఎక్స్ ఖాతా ద్వారా ఈ అప్‌డేట్‌పై స్పందించారు. సున్నితమైన కంటెంట్ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకే ఈ పటిష్ఠమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. 


More Telugu News