తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు సీపీ సజ్జనార్ హెచ్చరిక

  • వృద్ధుల సంరక్షణ పిల్లల బాధ్యత అని స్పష్టీక‌ర‌ణ‌
  • నిర్లక్ష్యం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
  • వృద్ధులు ఏ సమస్య ఉన్నా నేరుగా తనను సంప్రదించాలని భరోసా
కన్న పిల్లల చేత నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతున్న వృద్ధ తల్లిదండ్రుల సంఖ్య పెరగడంపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, అంతకుముందు సైబరాబాద్, టీజీఎస్ఆర్టీసీ, ఇతర జిల్లాల్లో పనిచేసిన అనుభవంతో తాను ఎన్నో సంఘటనలు చూశానని సజ్జనార్ తెలిపారు. ప్రతిరోజూ తనను కలిసే వందలాది పిటిషనర్లలో పిల్లలు పట్టించుకోకపోవడంతో నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులను చూసినప్పుడు తన మనసు తీవ్రంగా కలత చెందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను చూసుకోవడం అనేది పిల్లలు చేసే సాయమో, వారిపై మోపే భారమో కాదని, అదొక జన్మహక్కని ఆయన స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సాకులు, చర్చలకు ఆస్కారం లేదన్నారు.

"ఈరోజు మీరు మీ తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తిస్తారో, రేపు మీ పిల్లలకు అదే ఒక పాఠం అవుతుంది. ఈ తరం చేసే పనులే తర్వాతి తరానికి మార్గనిర్దేశం చేస్తాయి" అని సజ్జనార్ హితవు పలికారు. వృద్ధ తల్లిదండ్రులను వేధించడం లేదా వదిలివేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా వృద్ధులకు ఆయన భరోసా ఇచ్చారు. "మీరు ఒంటరి కారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సంకోచించకుండా నేరుగా నన్ను సంప్రదించవచ్చు. మీ ఆత్మగౌరవం, భద్రత, శ్రేయస్సు కాపాడటం హైదరాబాద్ పోలీసుల బాధ్యత" అని ఆయన హామీ ఇచ్చారు.


More Telugu News