మెస్సీకి టీ20 వరల్డ్ కప్ టికెట్ అందించిన ఐసీసీ చైర్మన్ జై షా

  • ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీతో ఐసీసీ ఛైర్మన్ జై షా భేటీ
  • మెస్సీకి టీమిండియా జెర్సీ, వరల్డ్ కప్ టికెట్ బహూకరణ
  • ఢిల్లీలో అభిమానులను ఉత్సాహపరిచిన లియోనెల్ మెస్సీ
  • ఘనంగా ముగిసిన 'గోట్ ఇండియా టూర్ 2025'
  • కార్యక్రమంలో పాల్గొన్న పలువురు క్రీడా, రాజకీయ ప్రముఖులు
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటన సోమవారం ఢిల్లీలో అట్టహాసంగా ముగిసింది. 'గోట్ ఇండియా టూర్ 2025'లో భాగంగా దేశానికి వచ్చిన మెస్సీ.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో అభిమానులను ఉర్రూతలూగించారు. ఈ సందర్భంగా ఐసీసీ ఛైర్మన్ జై షా, మెస్సీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

క్రికెట్, ఫుట్‌బాల్ క్రీడల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా జరిగిన ఈ భేటీలో, జై షా.. మెస్సీకి టీమిండియా జెర్సీతో పాటు సంతకం చేసిన క్రికెట్ బ్యాట్‌ను బహూకరించారు. అంతేకాకుండా, 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్‌కు హాజరు కావాలని అఫిషియల్ టికెట్ కూడా అందజేశారు. ఈ మ్యాచ్ లో టీమిండియా, అమెరికా జట్లు తలపడనున్నాయి.

కాగా, అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మెస్సీ ఈవెంట్ కు  వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. తన సహచర సాకర్ స్టార్లు లూయిస్ సువారెజ్ (ఉరుగ్వే), రోడ్రిగో డి పాల్‌ (అర్జెంటీనా)తో కలిసి మైదానంలోకి అడుగుపెట్టిన మెస్సీ... స్టాండ్స్‌లోని అభిమానులకు అభివాదం చేస్తూ, కొన్ని ఫుట్‌బాల్స్‌ను వారి వైపు తన్నారు. ఈ సందర్భంగా మెస్సీ స్పానిష్ భాషలో క్లుప్తంగా మాట్లాడుతూ, 'గ్రాసియాస్ ఢిల్లీ! హస్తా ప్రోంటో' (ధన్యవాదాలు ఢిల్లీ! త్వరలో మళ్ళీ కలుద్దాం) అని పలకరించారు.

కోల్‌కతాలో కొంత గందరగోళంగా ప్రారంభమైన మెస్సీ గోట్ టూర్, ఢిల్లీలో మాత్రం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ, భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా వంటి ప్రముఖులు పాల్గొన్నారు.


More Telugu News