Mallu Bhatti Vikramarka: ఈనెల 30 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. అనంతరం జరిగిన బీఏసీ సమావేశంలో బడ్జెట్ సమావేశాలను ఈ నెల 30 వరకు కొనసాగించాలని నిర్ణయించారు. రేపు, ఎల్లుండి గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, చర్చ ఉంటుంది. ఈ నెల 19న ఉగాది పండుగ సందర్భంగా సభకు సెలవు ఉంటుంది. మార్చి 20న డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
ఈ సమావేశాలు కేవలం బడ్జెట్‌కే పరిమితం కాకుండా, రాజకీయంగా కూడా వాడీవేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆరు గ్యారంటీల అమలు, రైతు భరోసా, మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు, హైదరాబాద్ మెట్రో విస్తరణ వంటి అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది.