ఆ ప్రచారాన్ని ముందే ఊహించా... 'ధురంధర్' మూవీ రేటింగ్స్ పై మాధవన్ స్పందన

  • బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్' వసూళ్ల సునామీ
  • వారం రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రం
  • సినిమాపై వస్తున్న నెగెటివ్ రివ్యూలపై స్పందించిన నటుడు మాధవన్
  • విమర్శలను తాను ముందే ఊహించానని ఆసక్తికర వ్యాఖ్యలు
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధానపాత్రలో నటించిన 'ధురంధర్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. అదే సమయంలో సినిమాపై వస్తున్న నెగెటివ్ రివ్యూలపైనా ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటుడు మాధవన్ ఈ విమర్శలపై స్పందించారు. ఈ నెగెటివ్ ప్రచారాన్ని తాను ముందే ఊహించానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ.. "ఈ సినిమా సమాజంపై కచ్చితంగా ప్రభావం చూపుతుందని నాకు తెలుసు. అందుకే మొదట కొందరు దీనికి చాలా చెత్త రేటింగ్స్ ఇస్తారని, ఆ తర్వాత మరికొందరు ఆశ్చర్యపోతారని నేను ముందే ఊహించాను. నటుడిగా నన్ను హీరోగా చూడాలని నేను కోరుకోవడం లేదు. పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ ఈ మార్పు అవసరం. ఈ సినిమా ఒక ఐకానిక్‌గా నిలుస్తుందని నాకు తెలుసు" అని అన్నారు. సినిమా విడుదల కాకముందే దాన్ని డిజాస్టర్ అంటూ రివ్యూలు రాయడం, రేటింగ్ లు ఇవ్వడం వెనుక ఏదైనా ఎజెండా ఉందేమో అనిపిస్తుందని, అయినా నటులుగా తాము ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటామని తెలిపారు.

ఇక వసూళ్ల విషయానికొస్తే, 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, డిసెంబర్ 11 నాటికి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 207.25 కోట్లు వసూలు చేసింది. తొలి మూడు రోజుల్లోనే రూ. 103 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. వీక్ డేస్‌లో కూడా స్థిరమైన కలెక్షన్లతో సత్తా చాటుతోంది.

డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం నటించింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ 'ధురంధర్ పార్ట్ 2'ను 2026 మార్చి 19న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దీనిపై మాధవన్ స్పందిస్తూ, "మొదటి భాగం కేవలం ట్రైలర్ మాత్రమే. మీరు ఇంకా ఏమీ చూడలేదు" అని ఉత్కంఠ పెంచారు.


More Telugu News