ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. సుప్రీం ఆదేశాలతో జూబ్లీహిల్స్ పీఎస్ కు ప్రభాకర్ రావు

  • సిట్‌ ఎదుట లొంగిపోయిన ప్రభాకర్‌రావు
  • ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్ పీఎస్ కు చేరుకున్న మాజీ ఐపీఎస్
  • ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతి
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఈ రోజు సిట్ ఎదుట లొంగిపోయారు. ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ప్రభాకర్ రావు.. సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. 

నిన్న సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సిట్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని, మొబైల్, ల్యాప్ టాప్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను మెమరీ మొత్తం డిలీట్ చేసి అప్పగించారని పేర్కొన్నారు. ఆయన నుంచి సమాచారం రాబట్టేందుకు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణకు అప్పగించాలని కోరారు. 

దీనికి సానుకూలంగా స్పందించిన అత్యున్నత న్యాయస్థానం.. వారం రోజుల కస్టోడియల్‌ విచారణకు అనుమతినిచ్చింది. ఆ తర్వాత వచ్చే రిపోర్టుపై మళ్లీ విచారణ చేస్తామని పేర్కొంది. ఈ సందర్భంగా ప్రభాకర్ రావుకు భౌతికంగా ఎలాంటి హాని జరగకుండా చూడాలని, చట్టప్రకారం దర్యాప్తు చేయాలని అధికారులకు సూచించింది.


More Telugu News