యూఎస్ కంపెనీలను "డీ-ఇండియనైజ్" చేయాలి: మార్క్ మిచెల్ వ్యాఖ్యలతో దుమారం

  • భారత టెకీలపై అమెరికా పోల్‌స్టర్ అక్కసు
  • ఈ ప్రక్రియలో సంస్థలకు సాయపడేందుకు ఓ కన్సల్టెన్సీ ప్రారంభిస్తానని ప్రకటన
  • హెచ్-1బీ వీసాలపై వచ్చే భారతీయులతో అమెరికన్ల ఉద్యోగాలు పోతున్నాయని ఆరోపణ
అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత, పోల్‌స్టర్ మార్క్ మిచెల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రధాన అమెరికన్ కంపెనీలు తమ సంస్థలను "డీ-ఇండియనైజ్" (భారతీయుల ప్రాబల్యం తగ్గించడం) చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ ప్రక్రియలో కంపెనీలకు సహాయం చేయడానికి తాను ఒక కన్సల్టెన్సీని ప్రారంభించాలనుకుంటున్నట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు అమెరికా టెక్నాలజీ రంగంలో భారత నిపుణుల పాత్రపై పెద్ద చర్చకు దారితీశాయి.

ఇటీవల స్టీఫెన్ బానన్‌తో కలిసి 'ది వార్ రూమ్' అనే పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మిచెల్, హెచ్-1బీ వీసా కార్యక్రమంపై తీవ్ర విమర్శలు చేశారు. "యాపిల్ లాంటి పెద్ద కంపెనీలలో పనిచేసే ఒక సీనియర్ హెచ్-1బీ డెవలపర్‌ను వెనక్కి పంపితే, అది పది మంది అక్రమ వలసదారులను దేశం నుంచి పంపడంతో సమానం" అని ఆయన అన్నారు. విదేశీ ఉద్యోగులు, ముఖ్యంగా భారతీయులు సిలికాన్ వ్యాలీని ఆక్రమించుకోవడం వల్ల సుమారు 1.2 కోట్ల మంది అమెరికన్ టెక్ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారని ఆయన ఆరోపించారు.

తక్కువ జీతాలకు లభించే వలస కార్మికులపై అమెరికన్ టెక్ కంపెనీలు ఆధారపడుతున్నాయని, అనుభవజ్ఞులైన అమెరికన్ ఇంజనీర్లను పక్కనపెడుతున్నాయని మిచెల్ విమర్శించారు. "కుటుంబ బాధ్యతలు, అధిక జీతాలు ఉన్న నాలాంటి వారిని తొలగించడం కంపెనీలకు సులభం" అని ఆయన పేర్కొన్నారు.

మిచెల్ "డీ-ఇండియనైజ్" వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చాలామంది ఆయనపై జాత్యహంకార ఆరోపణలు చేస్తూ విమర్శిస్తున్నారు. "ఇదే మాట యూదుల గురించి అని ఉంటే మీ కెరీర్ మిగిలేది కాదు. కానీ, అమెరికాలో భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం ఫ్యాషన్‌గా మారింది" అంటూ ఒక యూజర్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు కేవలం హెచ్-1బీ వీసాదారులకే కాకుండా, అమెరికాలో జన్మించిన భారతీయ-అమెరికన్లను కూడా లక్ష్యంగా చేసుకున్నాయని మరికొందరు అభిప్రాయపడ్డారు.


More Telugu News