టీడీపీ నేతలపై చంద్రబాబు ఫైర్.. రిపబ్లిక్ టీవీతో వివాదంపై ఆగ్రహం

  • రిపబ్లిక్ టీవీతో అనవసర వివాదంపై చంద్రబాబు ఆగ్రహం
  • చిన్న విషయాన్ని పెద్దది చేశారంటూ అధికార ప్రతినిధులపై అసహనం
  • అధికారంలో ఉన్నప్పుడు అనవసరంగా మాట్లాడటం తప్పన్న సీఎం
  • పార్టీ లైన్‌పై మార్గదర్శనం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడి
రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని ‘ఇండిగో విమానాల రద్దు’ అంశంపై రిపబ్లిక్ టీవీతో అనవసర వివాదం సృష్టించడంపై ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ అధికార ప్రతినిధులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మొదటి నుంచి టీడీపీకి సానుకూలంగా ఉండే చానల్‌తో ఘర్షణ వైఖరి అవలంబించడం సరికాదని హితవు పలికారు. నిన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వివాదం పెద్దదయ్యే వరకు తన దృష్టికి తీసుకురాకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు వెళ్లిన పార్టీ అధికార ప్రతినిధి దీపక్‌రెడ్డి మరింత సన్నద్ధతతో, సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిందని అన్నారు. చర్చలో అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడే ఆ విషయాన్ని వదిలేయాల్సిందని సూచించారు. ‘అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దది చేశారు. చానల్‌ను బహిష్కరిస్తున్నామని చెప్పడం ద్వారా వివాదాన్ని మరింత పెంచారు’ అని ఆయన మందలించారు.

అయితే, చానల్‌ను బహిష్కరిస్తున్నట్లు పార్టీ తరఫున ఎవరూ చెప్పలేదని ప్రతినిధులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, ‘మనం చెప్పకపోయినా వారికి ఆ అభిప్రాయం కలిగింది కదా? ఖాళీ కుర్చీ చూపించి టీడీపీ బహిష్కరించిందని చెప్పారు. పరిస్థితి అంతదాకా ఎందుకు తెచ్చుకోవాలి?’ అని ప్రశ్నించారు.

‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడకపోవడం ఎంత తప్పో, అధికారంలో ఉన్నప్పుడు అనవసరంగా మాట్లాడటం కూడా అంతే తప్పు. టీవీ చర్చలకు వెళ్లే ముందు బాగా సిద్ధమవ్వాలి’ అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్టీ లైన్, ప్రభుత్వ విధానాలపై అధికార ప్రతినిధులకు సరైన సమాచారం అందడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఇకపై వారికి మార్గదర్శనం చేసేందుకు ఇద్దరు మంత్రులు, ఇద్దరు సీనియర్ నేతలను నియమిస్తానని తెలిపారు. ‘రిపబ్లిక్ టీవీ చర్చలో ఆ అంశం కేంద్రం పరిధిలోనిదని చెప్పి ఉంటే సరిపోయేది’ అని ఆయన అభిప్రాయపడ్డారు.


More Telugu News