మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ దారుణ హత్య.. భర్తే హంతకుడు!

  • మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్‌ను హత్య చేసిన భర్త
  • గొంతు నులిమి చంపి శరీరాన్ని ముక్కలుగా నరికేశాడు
  • మృతదేహాన్ని బ్లెండర్‌లో వేసి రసాయనాల్లో కలిపే ప్రయత్నం
స్విట్జర్లాండ్‌లో దారుణ హత్యకు గురైన మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ క్రిస్టినా జోక్సిమోవిక్ (38) కేసులో ఆమె భర్తే నిందితుడని అధికారులు తేల్చారు. గోప్యతా నిబంధనల ప్రకారం, థామస్ (43)గా గుర్తించిన నిందితుడిపై హత్య అభియోగాలు నమోదు చేసినట్లు స్విస్ ప్రాసిక్యూటర్లు బుధవారం ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ హత్యోదంతంలోని వివరాలు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

బిన్నింగెన్‌లోని వారి నివాసంలో థామస్ తన భార్య క్రిస్టినాను మొదట గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి, ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించాడు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం, మృతదేహాన్ని ముక్కలు చేయడానికి రంపపు కత్తి, గార్డెన్ కత్తెరను ఉపయోగించాడు. 

అంతటితో ఆగకుండా, పారిశ్రామిక బ్లెండర్‌లో శరీర భాగాలను వేసి గుజ్జుగా మార్చి, రసాయన ద్రావణంలో కరిగించే ప్రయత్నం చేశాడు. దర్యాప్తులో పోలీసులు బ్లెండర్‌తో పాటు శరీర చర్మం, ఎముకల ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దారుణానికి ఒడిగడుతున్న సమయంలో నిందితుడు తన ఫోన్‌లో యూట్యూబ్ వీడియోలు చూస్తున్నట్లు కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు.

మొదట తన భార్య విగతజీవిగా కనిపించిందని చెప్పిన థామస్, మార్చిలో నేరాన్ని అంగీకరించాడు. అయితే, ఆమె కత్తితో దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసమే చంపినట్లు వాదించాడు. కానీ, ఫోరెన్సిక్ నిపుణులు ఈ వాదనను తోసిపుచ్చారు. ఊపిరాడకపోవడం వల్లే ఆమె మరణించిందని స్పష్టం చేశారు. మృతురాలి తండ్రి వారి ఇంటి లాండ్రీ గదిలో ఒక బ్యాగు నుంచి జుట్టు బయటకు కనిపించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

నిందితుడు అత్యంత క్రూరంగా, కనికరం లేకుండా ప్రవర్తించాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం థామస్‌పై హత్య, మృతదేహాన్ని అపవిత్రం చేయడం వంటి అభియోగాలు నమోదు చేశారు. విచారణ తేదీని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. కాగా, క్రిస్టినా 2007లో మిస్ స్విట్జర్లాండ్ పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచారు. అనంతరం ఆమె మోడలింగ్ కోచ్‌గా పలువురికి శిక్షణ ఇచ్చారు.


More Telugu News