గుడివాడలో కొడాలి నాని... నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి

  • మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమం
  • కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని
  • ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్
సార్వత్రిక ఎన్నికల తర్వాత దాదాపు 18 నెలలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని తిరిగి క్రియాశీలకంగా మారారు. అనారోగ్యం, ఇతర కారణాలతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని ఆయన, ఈరోజు గుడివాడలో వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో ఆయన పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా గవర్నర్‌కు అందించే వినతిపత్రంపై కొడాలి నాని సంతకం చేశారు. అనంతరం, పార్టీ శ్రేణులు సేకరించిన వినతిపత్రాలను జిల్లా కమిటీకి అందించేందుకు ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సుదీర్ఘ విరామం తర్వాత తమ నాయకుడిని చూసిన కార్యకర్తలు ఉత్సాహం ప్రదర్శించారు. కొడాలి నాని కూడా వారితో ఉత్సాహంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తేవాలన్న గొప్ప సంకల్పంతో మాజీ సీఎం జగన్ 17 మెడికల్ కళాశాలలను ప్రారంభించారని తెలిపారు. వైసీపీ హయాంలో ఐదు కాలేజీలు పూర్తయ్యాయని, మరో ఐదు తుది దశలో ఉన్నాయని తెలిపారు. పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడం దుర్మార్గపు చర్య అని ఆయన మండిపడ్డారు.

ప్రజల నుంచి తమ ఉద్యమానికి మంచి స్పందన వస్తోందని, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సేకరించిన వినతిపత్రాలను త్వరలో గవర్నర్‌కు అందజేస్తామని కొడాలి నాని తెలిపారు. 


More Telugu News