సెలక్షన్ వివాదం.. కోచ్ తల పగలగొట్టిన క్రికెటర్లు

  • జట్టులోకి తీసుకోలేదని పుదుచ్చేరి అండర్-19 కోచ్‌పై దాడి
  • దాడిలో కోచ్ వెంకటరామన్‌ త‌ల‌కు తీవ్ర గాయం, భుజం ఫ్రాక్చర్
  • ముగ్గురు స్థానిక క్రికెటర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు
  • ఓ ఫోరం కార్యదర్శి ప్రోద్బలంతోనే దాడి జరిగిందని కోచ్ ఆరోపణ
పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ (CAP)లో తీవ్ర కలకలం రేగింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి జట్టులో చోటు దక్కలేదన్న ఆగ్రహంతో ముగ్గురు స్థానిక క్రికెటర్లు అండర్-19 హెడ్ కోచ్ ఎస్. వెంకటరామన్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయమవగా, భుజం విరిగింది.

పోలీసుల కథనం ప్రకారం ఈ నెల‌ 8న ఉదయం 11 గంటల సమయంలో క్యాప్ కాంప్లెక్స్‌లోని ఇండోర్ నెట్స్‌లో ఈ దాడి జరిగింది. సీనియర్ క్రికెటర్ కార్తికేయన్ జయసుందరం, ఫస్ట్-క్లాస్ ఆటగాళ్లు ఎ. అరవిందరాజ్, ఎస్. సంతోశ్ కుమారన్ తనపై దాడి చేశారని వెంకటరామన్ సెదరపేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ‌ను జట్టులోకి ఎంపిక చేయకపోవడానికి కారణం నువ్వేనంటూ దూషిస్తూ దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. అరవిందరాజ్ తనను పట్టుకోగా, సంతోశ్‌ ఇచ్చిన బ్యాట్‌తో కార్తికేయన్ తనను చంపే ఉద్దేశంతో తలపై కొట్టాడని ఫిర్యాదులో తెలిపారు. ఈ దాడి వెనుక భారతిదాసన్ పాండిచ్చేరి క్రికెటర్స్ ఫోరం కార్యదర్శి జి. చంద్రన్ ప్రోద్బలం ఉందని ఆయన ఆరోపించారు.

ఈ ఘటనలో వెంకటరామన్ తలకు 20 కుట్లు పడ్డాయని, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని సబ్-ఇన్‌స్పెక్టర్ ఎస్. రాజేశ్‌ తెలిపారు. నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, వారు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

అయితే, ఈ ఆరోపణలను క్రికెటర్స్ ఫోరం ఖండించింది. వెంకటరామన్‌పై గతంలో అనేక కేసులున్నాయని, స్థానిక ఆటగాళ్లతో ఆయన ఎప్పుడూ దురుసుగా ప్రవర్తిస్తారని ఆరోపించింది. ఏడేళ్లుగా తాము క్యాప్‌లోని సమస్యలను బీసీసీఐ దృష్టికి తీసుకెళుతున్నందునే చంద్రన్‌పై కక్ష సాధింపు చర్యగా ఈ ఆరోపణలు చేస్తున్నారని ఫోరం ప్రతినిధి తెలిపారు.


More Telugu News