హైదరాబాద్- రేణిగుంట సర్వీసుకి బై.. స్పైస్‌జెట్ కీలక నిర్ణయం

  • ఇవాళ్టి నుంచి హైదరాబాద్-రేణిగుంట సర్వీసుల రద్దు
  • 15 ఏళ్లుగా కొనసాగిన సేవలకు స్వ‌స్తి
  • సంస్థాగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
  • ఆన్‌లైన్ బుకింగ్ సైట్ల నుంచి కూడా ఈ సర్వీసుల తొలగింపు
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్.. రేణిగుంట విమానాశ్రయానికి తన సేవలను నిలిపివేసింది. సుమారు 15 ఏళ్లుగా హైదరాబాద్-రేణిగుంట మధ్య కొనసాగిన విమాన సర్వీసులకు బుధవారం నుంచి స్వస్తి పలకనుంది. సంస్థాగత కారణాలతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఈ మార్గంలో సేవలను పునరుద్ధరించే అవకాశాలు లేవని సమాచారం.

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి రేణిగుంటకు స్పైస్‌జెట్ రోజుకు రెండు విమానాలను నడుపుతోంది. అయితే, బుధవారం నుంచి ఈ సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నాయి. స్పైస్‌జెట్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా హైదరాబాద్ నుంచి తిరుపతికి విమాన సర్వీసుల వివరాలు కనిపించడం లేదు. దీంతో ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు.

ఒకప్పుడు రేణిగుంటకు వివిధ ప్రాంతాల నుంచి అత్యధిక సర్వీసులు నడిపిన సంస్థగా స్పైస్‌జెట్‌కు పేరుండేది. అయితే, విమానయాన రంగంలో తీవ్రమైన పోటీ నెలకొనడంతో, స్పైస్‌జెట్ తన కార్యకలాపాలను క్రమంగా తగ్గించుకుంటూ వస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో 15 ఏళ్ల అనుబంధానికి తెరపడినట్లయింది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తులపై ఈ ప్రభావం పడనుంది.


More Telugu News