మధ్యప్రదేశ్ లో కరెంట్ తీగలను ఢీకొని కూలిన విమానం

  • 90 గ్రామాలకు నిలిచిన విద్యుత్ సరఫరా
  • హైటెన్షన్ తీగలను తాకి నేల కూలిన శిక్షణ విమానం
  • విమానంలోని పైలట్ తో పాటు మరొకరికి గాయాలు
మధ్యప్రదేశ్ లోని సివనీలో ఓ శిక్షణ విమానం నేల కూలింది. ల్యాండయ్యే క్రమంలో హైటెన్షన్ విద్యుత్ తీగలకు తాకడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్‌తోపాటు మరొకరికి గాయాలయ్యాయి. విమానం తాకడంతో విద్యుత్ వైర్లు తెగిపడి సుమారు 90 గ్రామాల్లో అంధకారం నెలకొంది. వివరాల్లోకి వెళితే..

రెడ్‌బర్డ్‌ ఏవియేషన్‌ సంస్థకు చెందిన ఓ శిక్షణ విమానం సుక్తరా ఎయిర్‌ స్ట్రిప్‌ లో ల్యాండయ్యే క్రమంలో ప్రమాదానికి గురైంది. రన్ వేకు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోని ఆమ్గావ్ గ్రామంలో 33కేవీ హైటెన్షన్‌ తీగలను తాకి నేలకూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌ అజిత్‌ ఛావ్డాతో పాటు మరొకరు గాయపడ్డారని అధికారులు తెలిపారు.

విమానం పడిపోవడం గమనించిన గ్రామస్థులు, విద్యుత్ సిబ్బంది సాయంతో పైలట్ ను రక్షించారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపినట్లు వెల్లడించారు. కాగా, విమానం ఢీకొనడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయని, దీని కారణంగా చుట్టుపక్కల దాదాపు 90 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు.


More Telugu News